- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మర్పల్లి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. మర్పల్లి మండలంలోని పట్లూరుకు చెందిన నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న సమాచారంతో బాధిత కుటుంబసభ్యులను గురువారం ఆమె పరామర్శించారు. ఓ మిస్సింగ్ కేసులో వీరిద్దరిని మర్పల్లి ఎస్సై సురేశ్ అదుపులోకి తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారన్నారు.
పోలీసుల తీరులో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామానికి చెందిన రాములు మిస్సింగ్ అయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఇదే క్రమంలో పట్లూరు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి శవం లభించిందని, దీనికి దళిత యువకులను బాధ్యులను చేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ దళిత యువకులను హత్య కేసులో ఇరికించే ప్రయత్నం పోలీసులు చేశారని ఆరోపించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.