హాస్టల్ స్పెషల్ ఆఫీసర్, ఐదుగురు సిబ్బంది సస్పెండ్

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో అల్పాహారం వికటించి 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఘటనపై  విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ  అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న నారాయణ్ ఖేడ్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థులందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకు ఏరియా ఆసుపత్రిలోనే ఉండి పర్యవేక్షించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు.  

స్పెషల్ ఆఫీసర్, ఐదుగురు వంట మనుషులు సస్పెండ్

ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ విచారణ చేపట్టారు. ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తూనే.. ఘటనపై విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణమైన స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు మరో ఐదుగురు వంట మనుషులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.