చేవెళ్ల, వెలుగు: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా చేవెళ్ల మండలంలోని వెంకటన్నగూడ, మల్లారెడ్డి గూడ, ఎర్రోని కొటాల, కౌకుంట్ల గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, మళ్లీ బీజేపీ కూడా గ్యారంటీలు అంటూ ప్రజలకు మోసం చేయడానికి ముందుకు వస్తోందన్నారు.
తెలంగాణ వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.5 నెలల రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ ను ఎందుకు వదులుకున్నామని నేడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్తే.. సీఎం రేవంత్ రెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని ఫైరయ్యారు. ప్రజలు, రైతుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ పటోళ్ల కృష్ణరెడ్డి, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.