క్రికెట్ దిగ్గజం, వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఆరాధ్య క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ 50వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు..రివార్డులు సాధించిన సచిన్ 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
1989 నవంబర్ 16న కరాచీలో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 1990 ఆగస్టు 14న టెస్టుల్లో మొదటి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత1994లో ఆస్ట్రేలియాపై వన్డేలో తొలి సెంచరీ చేశాడు. ఇక 1996లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సచిన్..కెప్టెన్ గా విఫలమయ్యాడు. 2006 డిసెంబరు 1న దక్షిణాఫ్రికాతో ఏకైక టి20 ఆడిన సచిన్ కేవలం 10 పరుగులే చేశాడు.
2010లో సౌతాఫ్రికాపై వన్డేలో 200పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 2012లో బంగ్లాదేశ్‌పై సెంచరీతో క్రికెట్ లో 100సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 24 ఏళ్ల కెరీర్ లో 100 సెంచరీలు సాధించాడు. 51 సెంచరీలు టెస్టు క్రికెట్‌లో పూర్తి చేయగా.. వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. 2013 నవంబర్ 16న వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 200మ్యాచ్‌ను ఆడిన సచిన్..సొంత మైదానం వాంఖడే స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం సచిన్ టెండూల్కర్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆ తర్వాత 2014ఫిబ్రవరి 04న భారతరత్నను అందుకున్నాడు.
సచిన్ క్రికెట్ కెరీర్ లో ..
ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సచిన్ టెండూల్కర్ ..క్రికెట్ అంటే పిచ్చి. చిన్నతనం నుంచి క్రికెట్ ఆశగా, శ్వాసగా బతికాడు. అందుకే కేవలం 15 ఏళ్లకే 1987-88లో బాంబే స్కూల్ స్నేహితుడు వినోద్ కాంబ్లీతో కలసి వరల్డ్ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.సచిన్ టెండూల్కర్ -వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల రికార్డుతో అందరి దృష్టి ఆకర్షించారు. ఈ మ్యాచ్‌లో సచిన్ 326 పరుగులు చేయడం విశేషం.
1989 నవంబరులో 16 ఏళ్ల వయసులో సచిన్ తొలి మ్యాచ్ ఆడాడు. కరాచీలో పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన సచిన్ కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక పాక్ తో జరిగిన రెండో టెస్టులో ఫస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. సియాల్‌కోట్‌లో జరిగిన టెస్టులో వకార్ యూనిస్ బౌలింగులో సచిన్ ముక్కుకు గాయమైంది. అయినా కూడా అర్థ సెంచరీ చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు.
1990 ఆగస్టు 14న ఓల్డ్ మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో సచిన్ మొదటి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 1994లో సెప్టెంబరు 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 110 పరుగులు చేశాడు. వన్డేల్లో సచిన్ కు ఇదే తొలి సెంచరీ. 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ దుమ్మురేపాడు. 523 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 1998లో ఏప్రిల్ 1న ఆస్ట్రేలియాతో కొచ్చిలో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 98 పరుగులు చేశాడు. షోయబ్ అక్తర్ బౌలింగులో సచిన్ కొట్టిన సిక్స్ హైలైట్. ఈ టోర్నీలోనూ 673 పరుగులు చేసిన చేసిన అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.2011లో ఏప్రిల్2 సచిన్ కల సాకారమైంది. టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. 2013లో నవంబరులో తన చివరి మ్యాచ్ ...కెరీర్ లో 200వ టెస్టు ఆడాడు. వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచులో సచిన్ 74 పరుగులు చేసి టెస్టుల నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపు పదేళ్లు పూర్తి చేసుకున్న సచిన్ ఏప్రిల్ 24వ తేదీన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులు, సహచర క్రికెటర్లు సచిన్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు..