భారత క్రికెట్ కి సచిన్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు భారత రత్న అవార్డు అందుకొని శిఖరాన నిలిచాడు. క్రికెట్ ని ఒక మతంగా భావిస్తే.. క్రికెట్ గాడ్ గా సచిన్ కి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టారు. ఇంత ఖ్యాతి సంపాదించిన టెండూల్కర్ కి ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఒక అరుదైన గౌరవం లభించింది.
అందరూ ఎంతగానో ఎదురు చూసిన వరల్డ్ కప్ సమరం మొదలయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికైంది. ఇక ఈ మ్యాచుకు ముందు వరల్డ్ కప్ ట్రోఫీని గ్రౌండ్ లోకి తీసుకొని వచ్చే అదృష్టం సచిన్ టెండూల్కర్ కి దక్కింది. సచిన్ ఈ ట్రోఫీ తీసుకోని వస్తుండగా నరేంద్ర మోడీ స్టేడియంలోని అభిమానులు భారీ చప్పట్లతో గ్రౌండ్ లోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు వారి జాతీయ గీతాన్ని ఆలపించారు.
కాగా.. ఇప్పటికే సచిన్ కి గోల్డెన్ టికెట్ తో పాటు ఇటీవలే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచుకు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ తో పాటు, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ గాయాలతో దూరమయ్యారు. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలిచి బోణీ కొడతారో చూడాలి.