Wimbledon 2024: ఆ టెన్నిస్ దిగ్గజంతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉంది: సచిన్ టెండూల్కర్

Wimbledon 2024: ఆ టెన్నిస్ దిగ్గజంతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉంది: సచిన్ టెండూల్కర్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ను ఎంతలా ఆరాధిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో బిజీగా ఉన్న సమయంలో సైతం ఏ మాత్రం ఖాళీ దొరికినా టెన్నిస్ మ్యాచ్ లు చూడడానికి ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా తనకిష్టమైన వింబుల్డన్ 2024 కు హాజరయ్యాడు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత వింబుల్డన్ యొక్క సోషల్ మీడియా టీమ్‌తో జరిగిన సంభాషణలో సచిన్ ఫెదరర్ ను తన బ్యాటింగ్ భాగస్వామిగా ఎంచుకున్నాడు. 

క్రికెట్ లో ఏ టెన్నిస్ ప్లేయర్ తో మీరు బ్యాటింగ్ చేయాలనే ప్రశ్న ఎదురైనప్పుడు సచిన్ తన భాగస్వామిగా ఫెదరర్‌ ను ఎంచుకుంటానని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. ఫెదరర్ కు క్రికెట్ తో సంబంధాలు ఉన్నాయని.. అతను క్రికెట్ ఫాలో అవుతాడని సచిన్ అన్నారు. క్రికెట్ లో సచిన్.. టెన్నిస్ లో ఫెదరర్ ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇద్దరూ తమ రంగాల్లో ఎన్నో ఘనతలు అందుకున్నారు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉండడమే కాదు.. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. శనివారం (జూలై 6) వింబుల్డన్ మ్యాచ్ ముగిసిన తర్వాత   టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో కలిసి కాసేపు ముచ్చటించారు.  

టెన్నిస్ డబుల్స్ లో ఒక భాగస్వామిని క్రికెట్ నుంచి ఎంచుకోమని అడిగితే షేన్ వార్న్, యువరాజ్ సింగ్ పేర్లు చెప్పారు. ఈ ఇద్దరిలో ఒకరితో టెన్నిస్ డబుల్స్ ఆడతానని ఈ క్రికెట్ దిగ్గజం అన్నారు. ఇంగ్లాండ్ లో ప్రస్తుతం వింబుల్డన్ 2024 జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు గ్రాండ్ స్లామ్స్ లో ప్రతిష్టాత్మకంగా భావించే వింబుల్డన్ మ్యాచ్ కు క్రికెట్ గాడ్, లెజెండరీ సచిన్ టెండూల్కర్ శనివారం (జూలై 6) హాజరయ్యారు. అలెగ్జాండర్ జ్వెరెవ్, కామెరాన్ నోరీ మధ్య జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ ను సచిన్ చూడడానికి వచ్చారు. సెంటర్ కోర్ట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సూట్ వేసుకొని కూలింగ్ గ్లాస్ తో రాయల్ బాక్స్ లో కూర్చున్నారు. 

ఈ మ్యాచ్ సందర్భంగా టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రెజెంటర్ సాధించిన విజయాలను, ఘనతలను తెలియజేసినప్పుడు ప్రేక్షకులు  చప్పట్లతో ఈ దిగ్గజాన్ని స్వాగతించారు. సచిన్ వింబుల్డన్ కు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సంవత్సరం వింబుల్డన్ మ్యాచ్ ను చూడడానికి వస్తారు. ఈ మ్యాచ్ లో జ్వరెవ్ వరుస సెట్లలో నోరీపై  గెలిచాడు.