టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తనను ఎంతగానో ఊరించిన 49 వ సెంచరీ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాపై కొట్టేసాడు. అది కూడా వరల్డ్ కప్ లో తన పుట్టిన రోజున చేయడంతో ఈ సెంచరీ మరింత స్పెషల్ గా మారింది. పుట్టిన రోజు కోహ్లీ సెంచరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ.. ఫ్యాన్స్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఈసెంచరీతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కోహ్లీ సమం చేసాడు. దీంతో సచిన్.. విరాట్ కోహ్లీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
"కోహ్లీ నువ్వు చాలా బాగా ఆడావు. నాకు 49 నుంచి 50 చేరుకోవడానికి 365 రోజులు పట్టింది. నువ్వు మాత్రం త్వరలోనే 50 వ సెంచరీ చేస్తావని ఆశిస్తున్నాను".అని ఇంస్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు. సచిన్ తన వయసును ఉద్దేశిస్తూ ఈ మాట చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఇటీవలే 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచిన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. విరాట్ పుట్టిన రోజే తన 49 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీ తన కెరీర్ లో 300 వన్డేలు కూడా ఆడకుండా 49 సెంచరీలు బాదేశాడు. ఈ వరల్డ్ కప్ ముందు వరకు వన్డేల్లో 47 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై తన 48 సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. న్యూజీలాండ్ పై 95 పరుగులు, శ్రీలంకపై 88 పరుగులు చేసిన కోహ్లీ.. తన 49 వ సెంచరీని తృటిలో కోల్పోయినా దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ అందుకొని సరి కొత్త చరిత సృష్టించాడు.