Milind Rege: ముంబై మాజీ సెలెక్టర్ కన్నుమూత.. సచిన్ టెండూల్కర్‌ ఎమోషనల్ పోస్ట్

Milind Rege: ముంబై మాజీ సెలెక్టర్ కన్నుమూత.. సచిన్ టెండూల్కర్‌ ఎమోషనల్ పోస్ట్

ముంబై మాజీ కెప్టెన్, సెలెక్టర్ మిలింద్ రేగే మరణించారు. 76 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో చనిపోయారు. రేగే అకస్మాత్తుగా మరణించడంతో ముంబై క్రికెట్ షాక్ లోకి వెళ్ళింది. 1960, 70 దశకాల్లో భారత డొమెస్టిక్ క్రికెట్ లో స్టార్ స్పిన్నర్ గా సత్తా చాటాడు. 1966-67,1977-78 మధ్య 52 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. తన స్పిన్ మాయాజాలంతో 126 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్ లో రాణించి 1,532 పరుగులు కూడా చేశాడు.

తన క్రీడా జీవితాన్ని ముగించిన తర్వాత రేగే ముంబై జట్టుకు సెలెక్టర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ పదవులను నిర్వర్తించాడు. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు అతనికి ముంబై, విదర్భ జట్లు నివాళి అర్పించారు. మ్యాచ్ కు ముందు ఒక నిమిషం మౌనం పాటించారు. రెగే గౌరవ సూచకంగా ముంబై ఆటగాళ్ళు చేతికి నల్లటి బ్యాండ్లు ధరించారు. రేగే మరణం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిచి వేసింది.

రేగే సెలక్టర్ గా ఉన్నప్పుడు 1988లో సచిన్ టెండూల్కర్ రంజీ ట్రోఫీ జట్టులో తొలిసారి సెలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి లెక్కలేనన్ని రికార్డ్స్ సెట్ చేశాడు. తన తొలి సెలక్టర్ మరణించడంతో సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. తన 'ఎక్స్' లో " మిలింద్ రేగే సర్ మరణించడం చాలా బాధగా ఉంది. ఆయన ముంబై క్రికెట్ కు అపారమైన కృషి చేసిన నిజమైన క్రికెటర్. ఆయనతో పాటు ఇతర సిసిఐ సభ్యులు నాలోని సామర్థ్యాన్ని చూసి సిసిఐ తరపున ఆడమని అడిగారు. నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇది నా కెరీర్ లో ఒక మైలురాయి క్షణం". అని టెండూల్కర్ తన పోస్ట్ లో రాశారు.