సూర్యాపేట/హుజూర్‌నగర్, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అమరుల ఆశయ సాధనకు ప్రజలు, పోలీసులు కృషి చేయాలని సూచించారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, పోలీస్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రాంచందర్, సీఐలు సోమనారాయణసింగ్, రాజేశ్, నాగార్జున, రాజశేఖర్, రామలింగారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే హుజూర్‌నగర్ పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించిన అనంతరం అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సైలు కట్టా వెంకట్‌రెడ్డి, కొండల్ రెడ్డి, నవీన్, సైదులు, రవి పాల్గొన్నారు.
అమరుల ఫ్యామిలీలకు అండగా ఉంటాం
నల్గొండ అర్బన్, వెలుగు : పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ ఆఫీస్‌లోని అమరుల స్థూపం వద్ద ఎస్పీ రెమా రాజేశ్వరి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ దేశ వ్యాప్తంగా 264 మంది పోలీసులు చనిపోయారని చెప్పారు. నల్గొండ జిల్లాలో విధి నిర్వహణలో ఇప్పటివరకు 14 మంది పోలీసులు చనిపోయారన్నారు.
అమరుల కుటుంబాలకు డిపార్ట్‌మెంట్ అండగా ఉంటుందన్నారు. అమరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31 వరకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, అడిషనల్ ఎస్పీ ఎండీ అష్పాఖ్, డీఎస్పీలు నర్సింహారెడ్డి, సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే అన్నేపర్తి బెటాలియన్‌లో జరిగిన కార్యక్రమంలో కమాండెంట్ ఎన్‌వీ.సాంబయ్య, అడిషనల్ కమాండెంట్ బి.రామకృష్ణ, సహాయక కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, తిరుపతి, అశోక్‌కుమార్, కృష్ణార్జున్‌రావు, అశోక్ పాల్గొన్నారు.
మట్టి మాఫియాపై కఠిన చర్యలు
కోదాడ, వెలుగు : మట్టి దందాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హెచ్చరించారు. శుక్రవారం స్థాని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కొందరు లీడర్లు అధికార పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రూ. 300 ఉన్న ట్రాక్టర్ మట్టిని కొందరు దళాకులు నాలుగ రెట్లు పెంచారని ఈ పద్ధతి సరైంది కాదన్నారు.
ఎవరికైనా ఇంటి అవసరాలకు మట్టి అవసరమైతే మున్సిపాలిటీ కమిషనర్, ఆర్డీవోకు అప్లై చేసుకోవాలని, వారి పర్మిషన్‌తో మట్టిని తరలించేందుకు కేవలం ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్‌లో నిర్మించిన 560 ఇండ్లలో అన్ని వసతులు కల్పించిన తర్వాత అర్హులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ క్యాండిడేట్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ను గెలిపిస్తాయన్నారు. అంతకుముందు మోతెకు చెందిన మాజీ జడ్పీటీసీ పుష్ప, రామకోటి దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరారు.
మాకెందుకు నిధులివ్వరు ?
మండల మీటింగ్‌లో నేలపై కూర్చొని ఎంపీటీసీ నిరసన
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు: ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధులు కేటాయించడం లేదంటూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు ఎంపీటీసీ సంధ్యారాణి నిరసన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఆమె నేలపై కూర్చొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఏటా రూ. 3 లక్షల నిధులు కేటాయిస్తూ, బీజేపీకి చెందిన తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
2019 నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో లేకపోతే నిధులు ఇవ్వారా అంటూ నిలదీశారు. దీంతో ఎంపీపీ వెంకట్‌రెడ్డి స్పందించి రూ. 2 లక్షల నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు. అనంతరం మండల అభివృద్ధి రిపోర్టులను ఆఫీసర్లు చదివి వినిపించారు. సమావేశంలో ఎంపీడీవో గ్యామానాయక్, ఎంపీవో జగదీశ్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జనగాం జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
యాదగిరిగుట్ట, వెలుగు: జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడంతో పాటు ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణగౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గీత కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని, ‘గీతన్న బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేయాలని కోరారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి, ప్రతి జిల్లాలో నీరా, తాటి ఉత్పత్తి కంపెనీలు ఏర్పాటు చేయాలన్నారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గీత కార్మికుడికి ఫ్యామిలీకి టూవీలర్ అందజేయాలని కోరారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపేందుకే యాదగిరిగుట్టలో మీటింగ్ నిర్వహించారనడం అవాస్తవం అన్నారు. గీత కార్మికుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించుకునేందుకే మహాసభలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం 25 తీర్మానాలు ఆమోదించి, కల్లుగీత కార్మిక సంఘం ఆఫీస్ బేరర్స్‌ను ఎన్నుకున్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయం
యాదాద్రి, వెలుగు : టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమని ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. డబ్బులు, నామినేటెడ్ పదవులను ఎరగా చూపుతూ బీజేపీ లీడర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.
లీడర్లు వెళ్లినా కార్యకర్తలంతా బీజేపీతోనే ఉన్నారన్నారు. రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనిని అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో శనివారం నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఐకేపీ సెంటర్లకు చెందిన కమిటీ సభ్యులు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన ట్రైనింగ్‌లో ఆయన మాట్లాడారు. రూల్స్ మేరకు ఉన్న వడ్లను వెంటవెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.
రైతు నుంచి వడ్లు కొన్న వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే కొనుగోలు సెంటర్ల సంఖ్య పెంచాలని సూచించారు. వడ్లలో 17 శాతం తేమ ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గన్నీ బ్యాగులు, వేయింగ్, మాయిశ్చర్ మెషీన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపీ కృష్ణ, డీపీఎం సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
చౌటుప్పల్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఆ పార్టీ యాదాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ కోరారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్, బీజేపీ డబ్బులను ఖర్చు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మునుగోడును అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలకు తెలుసన్నారు. బీజేపి, టీఆర్ఎస్ అహంకారానికి, మునుగోడు ఆడబిడ్డ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. కార్యక్రమంలో ఎల్లంబావి ఇన్‌చార్జి ఆనంద్‌రావు, స్టేట్ సెక్రటరీ పావని, జిల్లా జనరల్ సెక్రెటరీ అండాలు, జిల్లా సెక్రెటరీ లక్ష్మి, మండల అధ్యక్షురాలు రజిత పాల్గొన్నారు.
నారసింహుడిని దర్శించుకున్న కలెక్టర్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆఫీసర్లు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. తర్వాత ఆలయ మాఢ వీధుల్లో జరిగిన తిరువీధి సేవలో పాల్గొన్నారు.
మరోవైపు ఆలయంలో నరసింహుడికి నిత్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఏకాదశి సందర్భంగా ప్రధానాలయ ముఖ మంటపంలో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.14,00,873ల ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.