బావిలో దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య

హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లి కొడుకులను బావిలోకి తోసి ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు అది బావిలోకి దూకి ఒకరిని కాపాడగా.. తల్లీకొడుకు మరణించారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూరు గ్రామానికి చెందిన మామిడి కావ్య, కుమారస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు. ఆటో డ్రైవర్ అయిన భర్త వేములవాడకు కిరాయి ఉందని వెళ్లాడు. కావ్య తన కుమారులు విద్యాధర్ (9), శశిధర్ (7) లను తీసుకుని గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లింది. ఇద్దరు కొడుకులను బావిలోకి తోసి తాను కూడా దూకింది. పెద్ద కుమారుడైన విద్యాధర్ బావికి ఉన్న మోటర్ పైపును పట్టుకొని ప్రాణాలతో బయట పడగా చిన్న కుమారుడైన శశిధర్(7) మరణించాడు. 

విద్యాధర్ పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు అతన్ని కాపాడారు. కావ్య, శశిధర్ లను రక్షించే ప్రయత్నం చేసినా వారు అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదుచేసుకుని కావ్య ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుంటున్నారు.