సద్దుల బతుకమ్మ పూట పలు గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా మక్లూర్మండలంలో చెరువుకు వెళ్లిన పిల్లలను కోతి తరమడంతో నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే వరంగల్నగరంలోని రంగసముద్రం చెరువులో ఈతకు వెళ్లిన మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బతుకమ్మ పూల కోసం వెళ్లిన యువకుడు తామర పూలు తెంపుతుండగా తీగలు కాళ్లకు చుట్టుకుని మరణించాడు.
మాక్లూర్, వెలుగు : నిజామాబాద్జిల్లా మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో సోమవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలకు సిద్ధమయ్యారు. ఏడో తరగతి చదువుతున్న గ్రామానికి చెందిన బొల్లి రాజేశ్(13), తొమ్మిదో తరగతి చదువుతున్న పట్టేవార్అఖిల్(14) అభిలాష్ (13) ఎనిమిదో తరగతి చదివే హన్మంత్(11), డిగ్రీ చదివే దీపక్ (20) దుర్గా మాత దీక్షలో ఉండి చెరువు దగ్గర మూత్ర విసర్జనకు వెళ్లారు. ఇదే సమయంలో అక్కడున్న కోతులు ఒక్కసారిగా పైకి రాగా భయపడి చెరువులో దూకారు. ఈత వచ్చిన దీపక్ వెంటనేఅభిలాష్, హన్మంత్లను కాపాడగలిగాడు. అఖిల్, రాజేశ్నీటిలో మునిగిపోవడం, దగ్గరలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయాడు. ఈ విషాద ఘటనలో గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఆగిపోయాయి. ఎస్ఐ యాదగిరి గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈతకు వెళ్లి..
వరంగల్సిటీ : వరంగల్ నగరంలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతానికి చెందిన మాటూరి రామ్ చరణ్ (11) గోల్డెన్త్రిషోల్డ్ స్కూల్లో చదువుతున్నాడు. ఇతడి తండ్రి బార్షాపులో పని చేస్తుండగా, తల్లి కూలి పని చేస్తూ ఉంటుంది. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన క్రిష్వీక్షిత్(11) క్రిష్ణ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి అనిల్ ప్రైవేట్ఉద్యోగి. సోమవారం రామ్చరణ్, క్రిష్వీక్షిత్తో పాటు వీరి స్నేహితుడు యశ్వంత్ ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం వేళ ఉరుసు రంగసముద్రం చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో రామ్ చరణ్, క్రిష్వీక్షిత్గల్లంతు కాగా, యశ్వంత్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా నాలుగన్నర గంటల ప్రాంతంలో పోలీసులు గల్లంతైన వారి కోసం వెతికారు. రామ్ చరణ్ మృతదేహం దొరకగా, క్రిష్వీక్షిత్డెడ్బాడీ కోసం గాలిస్తున్నారు.
పూల కోసం వెళ్లి...
జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన ఆకుల వివేక్ (19) సద్దుల బతుకమ్మ సందర్భంగా సోమవారం ఉదయం తామర పూల కోసం తన స్నేహితుడు గంగాధర్ తో కలిసి గ్రామ సమీపంలోని ధర్మారం చెరువులోకి దిగాడు. పూలు తెంపుతుండుగా లోపల తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో నీట మునిగాడు. వెంట వెళ్లిన స్నేహితుడు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు చెరువులోకి దిగి వివేక్ ను బయటకు తీశారు. అప్పటికే ఊపిరాడక వివేక్ చనిపోయాడు. ఆకుల సతీశ్, అమృత దంపతుల ఇద్దరు కొడుకుల్లో వివేక్ పెద్దవాడు. వివేక్ తండ్రి ఆకుల సతీశ్రెండేండ్ల కింద బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.