హైదరాబాద్: పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కి సలాటలో ఊపిరి ఆడక సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు. ఈ క్రమంలో మృతురాలు రేవతి (36) భర్త భాస్కర్ మీడియాతో మాట్లాడారు. మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్.. అందరూ మా బాబుని పుష్ప అని పిలుస్తారు.. వాడి కోసమే మేము అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి వచ్చామని తెలిపారు. నా కుమారుడి కోసం వచ్చి నా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘మొదట నా భార్య పిల్లలు థియేటర్ లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే.. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగి తొక్కి సలాట జరిగింది’’ అని చెప్పారు. వెంటనే పోలీసులు నా భార్య, కుమారుడికి సీపీఆర్ చేశారు. పోలీసులు సీపీఆర్ చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఆసుపత్రికి తరలించే లోపే మా భార్య మృతి చెందిందని బాధపడ్డారు.
ప్రస్తుతం మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారని మీడియాకు వివరించారు. ఈ ఘటనపై మృతురాలు రేవతి కుటుంబ సభ్యులు, బంధువులు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించలేదు.. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. థియేటర్ వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్య టాకీస్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.