సాదాబైనామాలకు.. మోక్షమెప్పుడో

నిజామాబాద్, వెలుగు  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సాదా బైనామా అప్లికేషన్లకు మోక్షం లభించడం లేదు. 2020కి ముందు స్టాంప్​పేపర్​లేదా తెల్లకాగితాలపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లు చేసిన వాటిని రెవెన్యూ రికార్డులో నమోదు చేసి కొత్త పట్టాపాస్​ పుస్తకాలు అందించే ప్రక్రియ కంప్లీట్​కాక అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. సాగులో ఒకరు రికార్డులో మరొకరు ఉండడంతో సమస్యలు తలెత్తుత్తున్నాయి.

36,787 అప్లికేషన్లు..

భూములకు అంతగా విలువ లేని రోజుల్లో క్రయవిక్రయాలు తెల్ల కాగితం మీదే జరిగేవి. సాదాబైనామా మీద సాక్షి సంతకాలు చేస్తే సరిపోయేది. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం ఈ పద్ధతినే పాటించేవారు. వాటిని క్రమబద్ధం చేసి సాగుదారులకు ప్రభుత్వం పట్టాపుస్తకాలు అందిస్తోంది.చివరగా 2017 వరకు సాదాబైనామాలకు అవకాశం కల్పించారు. 2020 వరకు జరిగిన సాదాబైనామా అమ్మకాలను క్రమబద్ధం చేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తామని సర్కారు చెప్పడంతో ఉమ్మడి జిల్లాలో 36,787 అప్లికేషన్లు వచ్చాయి. 
 
ఎం​క్వైరీ ఎప్పుడో కంప్లీట్..​ 

సాదాబైనామాలు రాసుకొని, సాగులో ఉన్న భూమిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని గవర్నమెంట్​నుంచి గైడ్​లైన్స్​ ఉండడంతో రెవెన్యూ అధికారులు ఆ దిశగా గ్రౌండ్​లెవల్​లో ఎం​క్వైరీ పూర్తిచేశారు. పక్క రైతుల స్టేట్​మెంట్​లు నమోదు చేసి అర్హుల లిస్టు తయారు చేశారు. సర్కార్​ల్యాండ్ ఆక్రమించుకొని లేక వివాదాలు ఉన్న ల్యాండ్స్​పై  రైట్స్​పొందే దురుద్ధేశ్యంతో దరఖాస్తులు చేసుకున్న వాటిని పక్కనబెట్టారు. ఈ రకంగా 21,618 అప్లికేషన్లు రిజెక్ట్ ​చేశారు.15,169 దరఖాస్తులకు అర్హత ఉన్నట్లు తేల్చారు.ఇదంతా జరిగి రెండేళ్లు దాటింది. గవర్నమెంట్​నుంచి ఎప్పుడు ఆర్డర్స్ వచ్చినా పాస్​బుక్​లు జారీ చేసేలా ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ సర్కార్​వైపు నుంచి అలాంటి ఆదేశాలు లేక పెండింగ్​లోనే ఉన్నాయి.

ఆశతో చూస్తున్నా..

1994లో 19 గుంటల భూమి సాదాబైనామా కింద  కొనుగోలు చేశా. దాదాపు 30 ఏండ్ల సంది పంటలు పండిస్తున్నా. సాదబైనామా కింద పట్టాపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా. రికార్డుల పేరెక్కితే ఇంత రైతు బంధు వస్తదని ఆశ.- అరె నాగన్న, కోస్లి, నవీపేట

పెరుగుతున్న వివాదాలు..

ఎప్పడికప్పుడు ల్యాండ్​విలువ పెరుగుతుండడంతో ఒప్పందాల ఉల్లంఘనలు అధికమవుతున్నాయి. సాదాబైనామాల సంతకం తమది కాదని ఎదురు తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. దీనికి తోడు  రైతుబంధు సహాయానికి అర్హులు దూరమవుతున్నారు. పంట రుణాలు పొందని పరిస్థితి ఏర్పడింది.