సదర్ వేడుకలు  అదుర్స్​

సదర్ వేడుకలు  అదుర్స్​

గ్రేటర్ లో పలుచోట్ల  దున్నపోతుల విన్యాసాలు

హైదరాబాద్, వెలుగు :  సిటీలో సదర్ సందడి మొదలైంది.  కరోనాతో ఈ సారి వేడుకలపై ఎఫెక్ట్​ పడినా  ఘనంగా  జరిగాయి. దీపావళి తర్వాత రెండు రోజులు స్థానికంగా ఉండే యాదవ సంఘాల ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనాలు నిర్వహిస్తారు. చివరి రోజున పెద్ద సదర్ వేడుక నారాయణ గూడలోని వైఎంసీ చౌరస్తాలో ఉంటుంది.  కార్యక్రమానికి నగర నలుమూలాల నుంచే కాకుండా శివారు జిల్లాల నుంచి యాదవులు అధికంగా హాజరవుతారు.

పలు చోట్ల  వేడుకలు

దీపావళి తెల్లారి ఖైరతాబాద్, అమీర్ పేట్, సంతోష్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, చిలుకల గూడ , నార్సింగి​, శంషాబాద్​, కార్వాన్​ తదితర ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరిగాయి. సైదాబాద్​  యాదవులు చంచల్ గూడ జైల్ చౌరస్తాలో సమ్మేళనం నిర్వహించారు.  ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద స్థానిక యాదవులు ఉత్సాహంగా పాల్గొని దున్నపోతుల విన్యాసాలను ప్రదర్శించారు.

రాష్ట్ర పండుగగా సదర్ 

నారాయణ గూడలో నిర్వహిస్తున్న సదర్ సమ్మేళనం తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద జరిగిన వేడుకులకు మంత్రి హాజరై మాట్లాడారు. నిర్వాహకులు ఆయనను సన్మానించారు.

రానా స్పెషల్ అట్రాక్షన్..

హర్యానా నుంచి మధు యాదవ్ తీసుకువచ్చిన దున్నపోతు సుల్తాన్ సంతతికి చెందిన రానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదర్ వేడుకల కోసం గతేడాది నుంచి దీని పోషిస్తున్నారు. రోజుకు ఆరు వేల ఖర్చుతో పౌష్టిక ఆహారం అందిస్తున్నామని, ఖరీదైన మద్యం బాటిళ్లను పట్టిస్తేనే దీని జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని యజమాని చెప్పారు. సదర్ పండుగలో దున్నపోతు రాజసాన్ని ప్రదర్శించేందుకు రెండేళ్లుగా పెంచుతున్నామని, గతేడాది కూడా సదర్ వేడుకల్లో రానా విన్యాసాలు ఆకట్టుకున్నాయన్నారు.  ఒక్క ఏడాదిలోనే 350 కిలోలు పెరిగి ప్రస్తుతం 1,780 కిలోలు ఉందని తెలిపారు.

నేడు వైఎంసీఏ వద్ద పెద్ద సదర్

స్థానికంగా జరిగే సదర్ ఉత్సవాల తర్వాత నారాయణ గూడలోని వైఎంసీఏ వద్ద జరిగే పెద్ద సదర్ కు రాష్ట్రవ్యాప్తంగా యాదవులు తరలివస్తారు. నేడు సాయం త్రం 7 గంటల నుంచి మొదలై అర్ధరాత్రి వరకు సాగుతాయి. ఇప్పటికే పెద్ద సదర్ కోసం గతేడాది రంగప్రవేశం చేసిన సర్తాజ్ దున్నపోతును సిద్ధం చేయగా, ఈసారి కూడా సదర్ వేడుకల్లో పాల్గొంటుంది.  కరోనా కారణంగా సదర్ సమ్మేళనం జరగడంలేదని, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వేడుకల కు వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించి, ఫిజికల్​డిస్టెన్స్ పాటించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నారాయణ గూడకు వచ్చే పలు రూట్లను డైవర్ట్ చేశారు. కాచిగూడ నుంచి వైఎంసీఏ మీదుగా వెహికల్స్​ను టూరిస్టు హోటల్ మీదుగా, విఠల్ వాడీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ను రాం కోఠి వైపు, రాజమహల్లా నుంచి వచ్చే వాటిని రాంకోఠి వైపు, రెడ్డి కాలేజీ నుంచి వెహికల్స్​ బర్కత్ పురా వైపు, ఓల్డ్ బర్కత్ పురా పోస్టు ఆఫీసు మీదుగా వచ్చే వాటిని క్రౌన్ కేఫ్ వైపు, ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీసు మార్గంలో విఠల్ వాడీ వైపు, బర్కత్ పురా చమాన్ నుంచి టూరిస్టు హోటల్ వైపు, బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ మార్గంలో ట్రాఫిక్ ను నారాయణ చౌరస్తా వైపు మళ్లించినట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.