- సిటీలో ఉత్సాహంగా యాదవుల వేడుకలు
- వివిధ పార్టీల నేతలు, భారీగా జనం హాజరు
హైదరాబాద్, వెలుగు: సిటీలో సదర్ వేడుకలు శుక్రవారం ధూం ధాంగా స్టార్ట్ అయ్యాయి. దీపావళి తర్వాతి రోజు యాదవులు సదర్ వేడుకలను ఘనంగా
నిర్వహించడం సంప్రదాయం. వివిధ ఏరియాల్లో జరిగిన వేడుకులకు పలు పార్టీల నేతలు, జనం భారీగా తరలివచ్చారు. యాదవులు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేశారు. సనత్‌నగర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో పడాల రామిరెడ్డి లా కాలేజ్ వద్ద పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, చిలకల గూడ, చంచల్‌గూడ, నార్సింగి, కార్వాన్, శంషాబాద్‌లో దున్నలు విన్యాసాలతో అదరగొట్టాయి. పలు చోట్ల ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన దున్నపోతులను ప్రదర్శించగా వాటి విన్యాసాలు అదుర్స్ అనిపించాయి. నిర్వాహకులు పోటీపడి ఏర్పాట్లు చేశారు.
లవ్ రాణా, షారూఖ్ స్పెషల్ అట్రాక్షన్
ఖైరతాబాద్ బడా గణేశ్ చౌరస్తాలో జరిగిన వేడుకల్లో రూ. 30 కోట్ల విలువైన లవ్రాణా, షారూఖ్, జానీ (దున్నపోతులు) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వేడుకలు ధూంధాంగా సాగాయి. పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చింతల్‌బస్తీలో దున్న హల్చల్
చింతలబస్తీలో దున్నలను వేడుకలకు తీసుకెళ్తుండగా అందులో ఒకటి తాడు తెంచుకుని హల్చల్ చేసింది. ఖైరతాబాద్ చౌరస్తాలోకి దూసుకెళ్లింది. బస్తీ నుంచి ప్రధాన రోడ్డుపై వచ్చి అడ్డు వచ్చిన వాహనాలు ధ్వంసం చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. దున్నను కట్టడి చేసేందుకు యత్నించిన వారిపై దాడికి దిగింది. కొందరికి గాయాలు అయ్యాయి. చివరకు దున్నను వెంబడించి కట్టడి చేశారు.
నారాయణగూడలో నేడు పెద్ద సదర్
సిటీలో అన్ని సదర్లు ఒక ఎత్తు. నారాయణగూడలో జరిగే పెద్ద సదర్ మరోఎత్తు. శనివారం జరిగే పెద్ద సదర్ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు యాదవ సంఘం నాయకుడు లడ్డూయాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని యాదవ నాయకులతో పాటు వివిధ పార్టీల నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ఇక్కడ కింగ్, సర్తాజ్, బాహుబలి దున్నలను ప్రదర్శిస్తారు. రెండేళ్లుగా ఇవే స్పెషల్ అట్రాక్షన్. హర్యానాకు చెందిన వీటిని రూ. 16 కోట్లు పెట్టి తీసుకొచ్చి రెడీ చేస్తున్నారు. సదర్ సందర్భంగా నారాయణగూడలో నేటి సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ ఇన్ చార్జి సీపీ, డీఎస్ చౌహాన్ తెలిపారు. వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాదారులు వేరే రూట్లలో ట్రావెల్ చేయాలని ఆయన సూచించారు.