- యాదవుల ఆటపాటలతో దద్దరిల్లిన వైఎంసీఏ చౌరస్తా
బషీర్‌బాగ్/ముషీరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో శనివారం రాత్రి యాదవులు నిర్వహించిన సదర్ ఉత్సవాలు ధూంధాంగా సాగాయి. డీజే పాటలు, స్పెషల్బ్యాండ్స్ నడుమ యాదవ సోదరులు దున్నపోతులపై తీన్మార్ స్టెప్పులేస్తూ హోరెత్తించారు. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ దున్నరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
స్కంద సినిమా ఫేమ్ బాహుబలి దున్నరాజు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మూడు కిలోల బంగారు గొలుసు వేసి కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలాగే చేతక్, సూర్యకుమార్, రుద్ర, భీమ్, విరాట్, భాదల్, మున్నా, బాబు దున్నలు సందడి చేశాయి.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, ఖైరతా బాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి పాల్గొన్నారు.
ముషీరాబాద్ లో అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో, బోయిన్‌పల్లిలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో సదర్ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గోలూ, షేర్, శ్రీకృష్ణ, వినాయక్, రాజా వంటి భారీ దున్నలు విన్యాసాలతో సందడి చేశాయి.