స్టడీ టూరా..విహారయాత్రనా..!

స్టడీ టూరా..విహారయాత్రనా..!
  • పదవీ కాలం ముగిసే ముందు టూర్ ఏమిటని విమర్శలు
  • మహిళా ప్రజాప్రతినిధుల స్థానాల్లో వారి భర్తలు, కుమారులు
  • అధ్యయనం పేరుతో చండీగఢ్ వెళ్లిన పేట మున్సిపల్ కౌన్సిలర్లు
  •  ఒక వర్గానికే పరిమితమైన టూర్

సంగారెడ్డి/సదాశిపేట, వెలుగు: మరో ఐదు నెలల్లో పాలకవర్గ పదవీకాలం ముగుస్తుందనగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు చండీగఢ్ స్టడీ టూర్ కి  వెళ్లారు. రూ.15 లక్షల ఖర్చుతో బల్దియా మాస్టర్ ప్లాన్ తో పాటు వివిధ అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఈనెల 2న ఫ్లైట్ లో చండీగఢ్ వెళ్లారు. పాలకవర్గంలో ఒక వర్గం సభ్యులు ఈ టూర్ కు దూరంగా ఉండడం..

మహిళా సభ్యుల స్థానాల్లో వారి భర్తలు, కొడుకులు వెళ్లడం చర్చనీయాంశమైంది. 26 మంది కౌన్సిలర్లలో 17 మంది సభ్యులు చండీగఢ్ టూర్ కి వెళ్లారు. అసలు అది స్టడీ టూరా లేక ప్రజాధనంతో విహారయాత్రకు వెళ్లారా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వృథా ఖర్చులు తగ్గించాలని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదేశాలు జారీచేసినప్పటికీ సదాశివపేట మున్సిపల్ అధికారులు పాలకవర్గాన్ని చండీగఢ్ టూర్ కు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. 

2041 మాస్టర్ ప్లాన్ దిక్కేలేదు..

స్టడీ టూర్ కు వెళ్లిన కౌన్సిలర్లు పట్టణ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏ రోజు చర్చ జరపకపోగా, ప్రతిపాదించిన సందర్భాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవీకాలం ముగిసే టైం వచ్చేసరికి పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ గుర్తొచ్చిందా అంటూ కొందరు కౌన్సిలర్లు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి స్టడీ టూర్ వెళ్లాల్సిందే కానీ పదవీకాలం ముగిసే సమయంలో టూర్లు వేయడం తప్పని వాదిస్తున్నారు.

పార్టీలకతీతంగా వెళ్లాల్సిన టూర్ కు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు చెందిన కౌన్సిల్ సభ్యులు వెళ్లి కాంగ్రెస్ సభ్యులు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందులో వారికి తోడుగా  టౌన్​ ప్లాన్​ఆఫీసర్​భాస్కర్​గౌడ్​ను పంపించడంపై  మిగతా మున్సిపల్ సిబ్బంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చండీగఢ్ టూర్ తోపాటు ఇతరత్రా ప్రదేశాలను చూసి వచ్చేందుకు గడువు పెంచుకునేందుకు ఇందుకు తగ్గట్టు బల్దియా నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం  జరుగుతోంది. 

టూర్ కు చైర్ పర్సన్ దూరం కానీ.. 

చండీగఢ్ టూర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ వెళ్లలేదు. ఆ స్థానంలో ఆమె భర్త శివరాజ్ వెళ్లగా వైస్ చైర్మన్ చింతా గోపాల్ ఈ టూర్ కు సారథ్యం వహించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మాజీ చైర్ పర్సన్ జయమ్మ కూడా ఈ టూర్ కి వెళ్లలేదు. తొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ టూర్ కి దూరంగా ఉన్నారు. 2041 మాస్టర్​ ప్లాన్​పేరుతో చండీగడ్​ స్టడీటూర్​కు వెళ్లినట్టు మున్సిపల్ అధికార వర్గాలు తెలిపాయి.

2041 మాస్టర్​ప్లాన్ కోసమే

సదాశివపేట మున్సిపాలిటీలో 2041 మాస్టర్​ప్లాన్ కోసమే పాలకవర్గ సభ్యులు చండీగఢ్ టూర్ కి వెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే స్టడీటూర్​ కొనసాగుతోంది. చండీగఢ్​​రాష్ట్రంలో రూపొందించిన మాస్టర్​ప్లాన్​ను స్టడీ చేసేందుకు  కౌన్సిలర్లతో పాటు టీపీవో వెళ్లారు. టూర్​కు అయ్యే ఖర్చు ఇప్పటి వరకు బల్దియా చెల్లించలేదు. ఒక వేల టూర్​కు సంబంధించిన బిల్లులు పెడితే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తాం.

ఉమ, మున్సిపల్​కమిషనర్