
సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఇంటికి నంబర్ ఇచ్చేందుకు లంచం అడిగిన మున్సిపల్ ఆర్ఐ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని సిద్దాపూర్ హౌసింగ్ బోర్డులో ఉన్న ఎకో వాల్యూ వెంచర్లో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. 2023 సెప్టెంబర్ 25న ఇంటి నంబర్ కావాలని మున్సిపల్ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు. దీనికి రూ.10వేలు ఇవ్వాలని ఆర్ఐ పతంగి వెంకట్రావు అవుట్సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్‌తో డిమాండ్ చేయించాడు.
లంచం ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం బాధితుడి నుంచి ఆర్ఐ వెంకట్రావు, వేణుగోపాల్ మున్సిపల్ఆఫీసులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం 7బి/12 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి నిందుతులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తులో ఏసీబీ సీఐ వెంకట్రాజ్, ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.