- అంత్యక్రియలు చేయలేని దయనీయ స్థితి
- దాతల సహకారంతో అంతిమ సంస్కారాలు
- ప్రభుత్వం బాధ్యత తీస్కుంటుందన్న కలెక్టర్
భైంసా, వెలుగు: కొన్ని సంవత్సరాలకు ముందు తండ్రి చనిపోగా అన్నీ తానై చూస్కుంటోందా తల్లి. ఏమైందో ఏమో ఆదివారం ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కగానొక్క బిడ్డ అనాథగా మిగిలింది. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక దయనీయ స్థితిలో ఉండగా కొంతమంది చేసిన సాయంతో అంతిమసంస్కారాలు పూర్తి చేసింది.
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్ తరోడా గ్రామానికి చెందిన గంగామణ(36)ని భర్త విడిచిపెట్టడంతో పదకొండేండ్ల కూతురు దుర్గతో కలిసి ఉంటోంది. కూలీ చేసుకుంటూ కూతురిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. చేసే పనితో తిండికి కూడా కష్టం కావడంతో జీవితంపై విసుగు చెందిన గంగామణి శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నా అన్న వాళ్లు లేక దుర్గ అనాథగా మారింది. అంత్యక్రియలు కూడా చేయలేని స్థితిలో డబ్బుల కోసం ఇంటి ముందు ఓ గుడ్డ వేసుకొని చేయి చాచింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టడంతో తలా ఇంత సాయం చేశారు. దీంతో అంత్యక్రియలు పూర్తి చేసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ అభిలాష అభినవ్.. బాలికకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమెను చదివిస్తామని, అవసరమైన సాయం చేస్తామన్నారు.