హైదరాబాద్: భాగ్య నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. తీరొక్క పూలతో మహిళలు వేడుకలు చేసుకున్నారు. బతుకమ్మలతో అమరుల స్థూపం దగ్గర తొలిపూజ చేశారు. మంత్రి సీతక్క, విమలక్క తొలి పూజ నిర్వహించారు. అమరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీ జరిగింది. లేజర్ లైట్ షో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు విదేశాలలోను బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆత్మీయతతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్న ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు తోడుగా ఉండాలని పురుష ప్రపంచానికి సీతక్క విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక శాఖకు సీఎం పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను నగరంతో పాటు గ్రామాలలో ఎంతో ఘనంగా చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి గుర్తు చేశారు.
బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండగ అని, తెలంగాణ అంటే వాగులు, వంకలు, గుట్టలు, చెరువులు అని మంత్రి సీతక్క అన్నారు. చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామని, అలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. బతుకమ్మలో ప్రతి పువ్వుకు ఒక గుణం ఉందని, పూర్వీకులు మనకు ఇచ్చినటు వంటి పండుగకు భక్తితో పాటు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మంత్రి వివరించారు. గౌరమ్మను చేసే పసుపులో యాంటీబయాటిక్ ఉందని, చెరువులలో వేసే పూలతో నీరు శుద్ధి అవుతుందని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని మంత్రి సీతక్క చెప్పారు. బతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని, భవిష్యత్ తరాలకు మన బతుకమ్మను అందించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.