ఖమ్మంలో జిల్లాలో .. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

ఖమ్మంలో జిల్లాలో .. అంబరాన్నంటిన  సద్దుల బతుకమ్మ సంబరాలు

ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పూల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు గౌరమ్మను పూజించి ఆటపాటలతో సందడి చేశారు. ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు లోని మున్నేరు వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు.

అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలను సమర్పించారు. చివరి రోజు కావడంతో ‘పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ’ అంటూ ఆటపాటలతో చెరువు, కుంటల్లో బతుకమ్మలను వదులుతూ వీడ్కోలు పలికారు. పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. ఆయాచోట్ల పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

 

 

 

 

 

-  వెలుగు, నెట్​వర్క్​