బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..' అంటూ మహిళలు ఆడిపాడారు. 'పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా' అంటూ చివరి రోజు సాగనంపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తొమ్మిది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన గురువారం యువతులు, ముత్తయిదువలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకొన్నారు. రకరకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఊరూ..వాడా పూల వనమైంది.
ఆలయ ప్రాంగణాలు, చెరువు గట్లు, కుంటల వద్ద మహిళలు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. 'ఒక్కొక్క పువ్వేసి సందమామా.. ఒక్క జాము ఆయే సందమామా' అంటూ కొందరు.. 'చిత్తూ ... చిత్తూల బొమ్మ... శివుడి ముద్దూల గుమ్మ' అంటూ మరికొందరు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. కొన్ని చోట్ల డీజే పాటలకు అనుగుణంగా కోలాటం ఆడుతూ మహిళలు హోరెత్తించారు. అనంతరం బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి 'పోయిరా.. గౌరమ్మ పోయి రావమ్మా' అంటూ సాగనంపారు. మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు
వెలుగు నెట్వర్క్