దసరా తర్వాత బతుకమ్మ పండుగ .. ఏటా ఎడపల్లిలో కొనసాగుతున్న ఆనవాయితీ

దసరా తర్వాత బతుకమ్మ పండుగ .. ఏటా ఎడపల్లిలో కొనసాగుతున్న ఆనవాయితీ
  • బతుకమ్మ పండుగపై రెండు కథనాలు
  • భారీ బతుకమ్మలను చేసేందుకు మహిళలు పోటీ
  • నిలువెత్తు బతుకమ్మలు ప్రధాన ఆకర్షణ

ఎడపల్లి , వెలుగు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు ముందే సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తుంటే, నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం  ఏటా దసరా అనంతరం సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తారు.  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండగ ను  ఈనెల 15న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.   ఏటా దసరా అనంతరం పౌర్ణమి కి ముందు మంచి రోజు చూసి  బతుకమ్మ పండగ జరుపడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ గ్రామంలో దనరా తరువాత బతుకమ్మ పండగ నిర్వహించడానికి గల కారణాలపై  గ్రామస్తులు రెండు కథనాలు చెప్తున్నారు.

ఆడపడుచుల కోసం ఆలస్యంగా..

దసరా పండగకి ఆడపడుచులు అత్త వారింట్లో వుంటారు. దసరాకు ముందు పండగ జరిపితే అత్తవారింటి నుంచి ఆడపడుచులు  వచ్చే వీలుండదు. కనుక దసరా తరువాత బతుకమ్మ పండగ నిర్వహిస్తే  అందరితో కలిసి పండగని ఘనంగా నిర్వహించుకోవచ్చనే ఉద్దేశ్యంతో దసరా తరువాత బతుకమ్మ జరుపుకుంటారు.  మరో కథనం ప్రకారం.. దేశముఖ్ పాలనలో  గ్రామస్తులు   గడి వద్దనే తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకునేవారు. 

తొమ్మిది రోజుల తర్వాత   సద్దుల బతుకమ్మ రోజు  నిమజ్జనానికి బయలు దేరేవి. అయితే ఒక రోజు దేశముఖ్ సిపాయి తుపాకీ పెల్చే యత్నంలో  పొరపాటున మిస్ ఫైర్​ అయి   సిపాయి మృతి చెందాడు. దీంతో సిపాయి మృతి ముట్టుడుగా (అరిష్టంగా) భావించి అప్పటి నుంచి బతుకమ్మ పండుగ దసరాకు ముందు జరపడంలేదు.  దసరా తర్వాత పార్ణమికి ముందు మంచి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం ప్రారంభించారు. 

గునగపూవుల కోసం..

ఎడపల్లిలో జరిగే బతుకమ్మ పండగ కోసం గ్రామస్తులు 20 రోజుల ముందు నుంచే గునగ పువ్వు సేకరణ లో నిమగ్నమవుతారు. కిలోమీటర్లు వెళ్లి ఈ పూలు సేకరిస్తారు. గునగపువ్వు తో పెద్దపెద్ద పువ్వు బతుకమ్మలు తయారు చేయడానికి పోటీ పడుతుంటారు. గునగపూల బతుకమ్మలే ఈ పండగలో ప్రధాన ఆకర్షణ.   నిలువెత్తు బతుకమ్మలను చేయడానికి అందరూ పోటీపడతారు. 

భారీ బతుకమ్మలను తయారు చేయడంతో మగవాళ్లే వాటిని నిమజ్జనానికి మోసుకెళ్తారు. రెండు కిలోమీటర్లు దూరం ఉన్న దేశ్​ముఖ్​ గడి నుంచి  స్తానిక బతుకమ్మ చెరువు వరకు బతుకమ్మలను తీసుకెళ్లి  నిమజ్జనం చేస్తారు.  నిమజ్జనానికి బతుకమ్మలు తరలించే క్రమంలో మొదటి బతుకమ్మ చెరువు వద్ద వుంటే చివరి బతుకమ్మ  గ్రామంలోని దేశ్​ముఖ్​ గడీ వద్ద వుంటుంది.  బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో ర్యాలీని తలపిస్తుంది.  ఈ వేడుకలను  చూడడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీగా 
తరలివస్తారు.