రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలె : సాధం వెంకట్

రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలె : సాధం వెంకట్

ఎడ్లు ఎన్ని సచ్చాయన్నది కాదు.. వడ్లు ఎన్ని పండాయన్నదీ లెక్క అన్నట్లుగా ఉన్నవి నేటి రాజకీయాలు. ఏమి చేశామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే పరిస్థితి ప్రస్తుతం అన్నిచోట్ల నెలకొని ఉంది. రెండు రెండ్లు నాలుగు అన్నది ఎంత నిజమో ఈ దేశంలో బీసీలు 65 శాతం దాకా ఉన్నారన్నది కూడా అంతే నిజం. రాజకీయంగా బీసీ వర్గాలను చంపి.. పాలక కులాలు తమ రాజకీయ ప్రభను వెలిగించుకోవటం ఏ రకమైన సామాజిక న్యాయం?  బీసీల రాజ్యాధికారం చట్టుబండలు అవుతున్న వేళ బీసీ సంఘాల పగటి వేషాలు.. బీసీ ప్రజలకు ఉండే సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనానికి శాపంగా మారుతున్నాయి.  

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకు జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీని నిలదీయాలి. బీసీలు ఒక్కసారి ఓటువేసి వందసార్లు  పాలక కులాలకాడ ఎందుకు చేతులు కట్టుకోవాలి?  వివిధ వ్యవస్థలతో ప్రజా సంబంధాలు ఎలా ఉండాలో తెలిపేలా ప్రతి నిత్యం రాజ్యాంగ పఠనం చేసేలా ఓ సిలబస్ తయారు  చేయాలి. బీసీలకు ఉన్నవి అరకొర అవకాశాలే. అవికూడా పాలక కులాల వారు అధికారంలోకి వచ్చేందుకు, సీఎం అయ్యేందుకు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి కల్పించిన అవకాశాలే తప్ప మరొకటి కాదు.

 బీసీలు రెండు రకాలుగా ఉద్యమించాలె 

ఉద్యమాలే ఊపిరిగా బీసీలు పోరాడాలి. రెండంచెల్లో వారు ఉద్యమించాలి. ఒకటి దీర్ఘకాలిక చైతన్య ఉద్యమం, రెండు స్వల్పకాలిక ఎత్తుగడ ఉద్యమం చేయాలి. ఎన్నికలే ధ్యేయంగా ఎత్తుగడలు వేయాలి. బీసీలు గెలిపించడం కంటే ఓడించడంతోనే రాజకీయంగా చర్చకి వస్తారు. రాజ్యాధికారం సాధించినప్పుడే వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 5,6 లక్షలు ఓట్లు చీల్చడం, బీసీల నినాదం హైలైట్ కావటం కోసం వంద నుంచి వెయ్యి నామినేషన్లతో హడలెత్తించాలి. ఆ నామినేషన్లతో పాలక కులాలకు బెంబేలెత్తించాలి.

5శాతం ఉన్న ఉన్నత కులాలకు భయపడి 60 శాతం టికెట్లు ఇస్తున్నారు. పాలక కులాలు 60శాతం ఉన్న బీసీలకు 5 నుంచి 15శాతం మాత్రమే చట్ట సభల్లో అవకాశం ఇస్తున్నాయి. ఇది ఉల్టా అయితేనే వడ్డించే కాడ మనవాళ్ళు కూడా ఉంటారు.  తెలంగాణ కల సాకారానికి 65 ఏండ్లు పట్టింది. వేల మంది ప్రాణాలు పణంగా పెట్టారు. బీసీల రాజ్యాధికార నినాదాన్ని భోజనాలు, చాయ్ బిస్కట్స్ కాడ ముచ్చటగా చేసేశారు. ఇదేవిధంగా ఉంటే బీసీల రాజ్యాధికార కల సాకారానికి 100 ఏండ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. 

ప్రజాస్వామ్యం గెలవాలంటే, బీసీలు గెలవాలె

బీసీ మిత్రులారా..పాలక కులాలు తక్కువ సంఖ్య ఉన్నా ఐక్యంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారు. బీసీలు 125 కులాలు ఉన్నప్పటికీ ఐదు కులాల్లోనే 95 శాతం జనాభా ఉంది. మనువు విడదీసి కొట్టిన దెబ్బకి బీసీలు నేటికీ తల్లడిల్లి పోతున్నారు. బీసీలలో 5,6 కులాలు ఐక్యమైనా రాజ్యాధికారం బీసీలదే.  కానీ, బీసీలను కుర్చీ కాపాడుకునేవాడు ఎంబీసీలుగా విడదీసే కుట్రలు చేస్తున్నడు. ఎంబీసీలుగా విడదీసే పాలక కులాల మాయలో బీసీలు పడొద్దు. అన్ని బీసీ కులాలు ఐక్యంగా ఉండాలి. అలా జరగకపోతే బీసీలు నిరంతరం మోసపోతూనే ఉంటారు.

ALS0 READ: ఇంకా ముంపు బాధలే.. సిటీలో వరద కష్టాలకు చెక్ పెట్టని సర్కార్

యాదవులు, గౌడ్స్, పద్మశాలి తదితర కులాలకు ఎంపీ, ఎమ్మెల్యే  టికెట్స్ ఇస్తున్నారంటే ఎవరి మీద సానుభూతితో కాదు. వారి జనసంఖ్య ఎక్కువ.  పాలక కులాలకు ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు వారికి క్యాస్ట్, క్యాష్ చూసి ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారు. తాము ఏమీ కోల్పోతున్నామో తెలియకుండా వైరివర్గాలుగా బీసీలు విడిపోవటం వల్ల రాజకీయంగా ఊహించని నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యం గెలవాలంటే 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలి.

-సాధం వెంకట్, సీనియర్​జర్నలిస్ట్