'ఆడినన్ని రోజులు జట్టులో చోటు.. అది ముగిశాక జట్టు నుంచి బయటకి దొబ్బేయడం..' క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. జెంటిల్‌మెన్ గేమ్‌గా పిలవబడే క్రికెట్ ప్రపంచంలోకి ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు... పోతుంటారు. ఇవాళ్టి మ్యాచ్‌లో కనిపించిన ఆటగాడు.. రేపటి మ్యాచ్‌లో ఆడతాడో.. ఆడడో కూడా చెప్పలేం. రాణించని వారిని తొలగించకపోతే.. రాణించే వారికి అవకాశం దక్కదు కదా! కావున రాకపోకలు సహజం. కానీ, పాక్ మిస్టరీ స్పిన్నర్ 'సయ్యద్ అజ్మల్' క్రికెట్ కెరీర్ మాత్రం అందుకు విభిన్నం.
క్రికెట్ ప్రపంచంలో అగ్ర దేశాల బ్యాటర్లకే ముచ్చెమటలు పట్టించిన బౌలర్.. అజ్మల్. ఇప్పుడంటే నరైన్, హసరంగా, తీక్షణ.. అంటూ మిస్టరీ స్పిన్నర్ల గురుంచి మాట్లాడుతున్నాం కానీ, అజ్మల్ పదిహేనేళ్ల కిందటే ఓ మిస్టరీ స్పిన్నర్.అతడు బౌలింగ్ కు దిగాడంటే.. ఓవర్లకు ఓవర్లు మెయిడిన్లే. తన బౌలింగ్ వేరియేషన్స్‌తో టాప్ క్లాస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టేవాడు. పాక్ జట్టు తరుపున 2008లో ఎంట్రీ ఇచ్చిన అజ్మల్.. కొద్ది రోజుల్లోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 వన్డే, టీ20 బౌలర్‌గా నిలిచాడు. అలాంటి గొప్ప బౌలర్ ఉన్నట్టుండి కనుమరుగయ్యాడు. అందుకు కారణం.. తనపై కుట్ర జరిగిందని చెప్తున్నాడు అజ్మల్.
అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని నిరూపితం కావడంతో.. 2014లో ఐసీసీ అతనిపై నిషేధం విధించింది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. అతడు బౌలింగ్ శైలి లేదు. 15 డిగ్రీల కంటే ఎక్కువగా తిరుగుతున్నట్లు నిర్దారించారు. ఈ కారణంగానే ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. ఇదొక కుట్ర అని చెప్తున్నాడు అజ్మల్. ఇదంతా పాక్ ఆటగాడిని అవ్వడం వల్లే జరిగిందని.. ఒకవేళ ఇండియాలో పుట్టి ఉంటే ఈపాటికి 1000 వికెట్లు తీసేవాడినని చెప్తున్నాడు.
"నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతూ ఉంటే 1,000 వికెట్లు తీసి ఉండేవాడిని. ఇది నిజం. మీరూ నమ్మాలి. నేను ఇండియాలో పుట్టి ఉంటే అదే జరిగేది. ప్రతి ఏడాది 100 వికెట్లు తీసుకోగల సత్తా నాలో ఉంది. నేను ఆడిన నాలుగైదు ఏళ్లలోనే ప్రతి ఏడాది 100 వికెట్లు తీసుకున్నా.. కావాలంటే గణాంకాలు చెక్ చేసుకోండి..' అంటూ అజ్మల్ పోడ్‌కాస్ట్‌లో వాపోయాడు.
Saeed Ajmal - It is very difficult to be a Pakistani bowler, if I was an Indian bowler I would have taken more than 1000 wickets. pic.twitter.com/Jp94OoIv7e
— Nawaz ?? (@Rnawaz31888) July 1, 2023
ఇక తనపై విధించిన నిషేధం గురుంచి మాట్లాడుతూ.." అదొక కుట్ర. నేను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఉన్నప్పుడు నాపై బ్యాన్ పడింది. అప్పటివరకు నా బౌలింగ్ శైలిపై వారికి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఆలోచించండి.. నెం.1 బౌలర్‌గా మారినప్పుడే ఎందుకు బ్యాన్ వేశారు? ఇది నన్ను అణిచివేసేందుకు జరిగిన రాజకీయ కుట్ర.." అని అజ్మల్ తెలిపాడు.
అజ్మల్ చెప్పినట్లు.. నెం.1 బౌలర్ అయ్యాక వేటు పడింది వాస్తవమే అయినా, ఐసీసీ మార్పులకు అనుగుణంగా తన బౌలింగ్‌ని మార్చుకోలేకపోయాడు. ఈ కారణంగానే అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. 2015లో ఆఖరి మ్యాచ్ ఆడిన అజ్మల్.. ఆ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.