- మాన్యువల్ స్కావెంజర్ సేవలపై నిషేధం
- సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు పి.పి.వావా
నిజామాబాద్, వెలుగు : నిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే సేవలలో నిమగ్నమయ్యే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమాన్ని ఆఫీసర్లు పర్యవేక్షించాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు పి.పి.వావా కోరారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. 1993 నుంచి మాన్యువల్ స్కావెంజర్ సేవలపై నిషేధం అమలులో ఉందని, ఈ విషయాన్ని ప్రచారం చేయాలన్నారు.
స్కావెంజర్లుగా గుర్తించిన వారి పునరావాసానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చొరవ తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు చేసేవారి ఆరోగ్య పరిరక్షణకు రెగ్యూలర్‌గా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలన్నారు. బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, సేఫ్టీ కిట్లను ఇవ్వాలన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ..
జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని, కార్మికుల పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద కార్పొరేట్స్కూల్స్లో ఉచిత విద్య అందిస్తున్నామని, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నామన్నారు.
సఫాయి కార్మికులకు సంబంధించి 15 ఏండ్ల నుంచి అట్రాసిటీ కేసులులేవన్నారు. సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్అంకిత్, నగర పాలక కమిషనర్ మంద మకరంద్, కేంద్ర సామాజిక న్యాయ విభాగం సభ్యుడు గిరిధర్నాథ్, కోఆర్డినేటర్ చరణ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.