- వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
అమ్రాబాద్, వెలుగు : కృష్ణమ్మ సమీపంలో, నల్లమల అడవిలో ఉన్న అక్క మహాదేవి గుహలకు సఫారీ, ట్రెక్కింగ్ ప్రారంభమైంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలను సోమవారం దోమలపెంట వనవిహారీ కాటేజీ వద్ద ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఆసక్తి గల వారు www.amrabadtigerreserve.com వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని ఆఫీసర్లు సూచించారు. సఫారీ బుక్ చేసుకున్న వారు మధ్యాహ్నం 2.30 గంటలకు వన మయూరి గెస్ట్‌హౌజ్ వద్దకు చేరుకోవాలి.
మూడు గంటలకు చెక్‌ఇన్ అయ్యాక, 3.30 గంటలకు సఫారీ వెహికల్ ద్వారా ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్దకు, వజ్రాలమడుగు వద్ద గల వాచ్‌టవర్ వద్దకు తీసుకెళ్లి నల్లమల అడవిని, సుడులు తిరిగినట్లున్న కృష్ణమ్మను, వన్యప్రాణులను చూపిస్తారు. వనమయూరి గెస్ట్ హౌజ్ వద్ద రాత్రి బస చేశాక, తెల్లవారుజామున గెస్ట్‌హౌజ్ నుంచి సఫారీ వెహికల్ ద్వారా అక్కమహాదేవి గుహల రోడ్డు వద్దకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ టైంలో స్థానిక చెంచు యువకులు గైడ్‌లుగా వ్యవహరిస్తూ, సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో మహాశివుడి భక్తురాలు అక్క మహాదేవి తపస్సు చేసిన చోటికి తీసుకెళ్తారు. దర్శనం అనంతరం తిరిగి 12 గంటల వరకు వనమయూరి గెస్ట్ హౌజ్ వద్దకు చేర్చడంతో ట్రిప్ ముగుస్తుంది.