వనపర్తి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగవరం రైతు వేదికలో ఆదివారం రైతు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమంతో దిగివచ్చి ఆ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలన్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎండీ జబ్బార్, బాల్ రెడ్డి, పరమేశ్వర చారి, వెంకటేశ్, మహబూబ్ పాషా, ఎం కృష్ణయ్య, దేవేందర్, భాస్కర్, ఆది, వెంకట్రాములు పాల్గొన్నారు.