హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో యాసంగి సాగు కోసం నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌అండ్‌ఆఫ్ విధానంలో మొత్తం ఏడు విడతల్లో నీటి విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఆఫీసర్లు ప్రకటించారు. మొదటి విడత నీటి విడుతల ఈ నెల 15నే ప్రారంభం కాగా జనవరి 11 వరకు మొత్తం 27 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుంది. తర్వాత జనవరి 12 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు విడుదలను ఆపివేస్తారు. తర్వాత రెండో విడతలో జనవరి 19 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు నీటిని విడుదల చేసి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆరు రోజుల పాటు నిలిపివేస్తారు.
మూడో విడత ఫిబ్రవరి 5న ప్రారంభమై 14 వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగనుండగా, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఆరు రోజులు ఆఫ్ కానుంది. నాలుగో విడత ఫిబ్రవరి 22 నుంచి మార్చి మూడు వరకు, ఐదో విడత మార్చి 11 నుంచి 20 వరకు, ఆరో విడత మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగనుంది. చివర్లో ఏడో విడత ఏప్రిల్ 14న ప్రారంభమై 23 వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసిన నీటితో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎన్‌ఎస్పీ ఆఫీసర్లు రైతులకు సూచించారు.