- పరిశీలించిన ఎన్ఎస్పీ అధికారులు
- సర్కారు నుంచి ఫండ్స్ రాగానే రిపేర్లు చేస్తామన్న ఆఫీసర్లు
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకట్టపై నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ సమీపంలోని డెయిరీ ఫాం తూము వద్ద భారీ గొయ్యి పడింది. దీంతో ఆ ప్రదేశంలో కాల్వకట్ట తెగే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాలేరుకు ఎడమకాల్వ నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేసిన టైంలోనూ గొయ్యి పడిందని రైతులు చెబుతున్నారు.
ఎడమకాల్వకు నీటి విడుదల జరిగితే కాల్వకట్ట తెగే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. గత ఏడాది నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ దగ్గర ఎడమ కాల్వ యూటీకి గండిపడి 5 వేల ఎకరాల్లో సాగులో ఉన్న వరి దెబ్బతిందన్నారు. కాగా గొయ్యి పడిన ప్రాంతాన్ని సోమవారం ఎన్ఎస్పీ ఈఈ లక్ష్మణ్, డీఈ గోపీనాథ్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ గండి పడే అవకాశమున్న ప్రాంతంలో రిపేర్లు చేసేందుకు త్వరలోనే టెండర్ పిలుస్తామన్నారు. ప్రభుత్వ నుంచి ఫండ్స్ రాగానే మరమ్మతులు మొదలు పెడతామన్నారు.