అమ్మాయిని కలుస్తున్నాడంటూ కొట్టి చంపిండ్రు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో లావుడియ సాగర్​ హత్య కేసులో నలుగురు నిందితులను మందమర్రి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. ఆదివారం మందమర్రి పోలీస్​స్టేషన్​లో మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ సుదీర్ రామనాథ్ కేకన్,  బెల్లంపల్లి  ఏసీపీ సదయ్య తెలిపిన వివరాల ప్రకారం..   కాసిపేట మండలం మామిడిగుడాకు చెందిన లౌవుడియా సాగర్​(22) మందమర్రిలోని దీపక్​నగర్​లో ఒక వాటర్​ప్లాంట్​లో కొన్నాళ్లు పని చేశాడు.

 కాలనీలోని ఒక యువతితో సాగర్​కు పరిచయమైంది.  యువతి వెంట పడొద్దని గతంలో నిందితులు బెదిరించారు.  ఈ నెల12న రాత్రి 10 గంటల ప్రాంతంలో యువతి ఇంట్లో సాగర్​ ఉన్నాడని నిందితులు  బోగ వెంకటేశ్​, అల్లంకుంట గణేశ్​, బొడ్డు బాలాజీ, నూనె వెంకటేశ్​ తెలుసుకుని చితకబాదారు.  అనంతరం  కేకే1 మైన్​ ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో కొట్టి చంపారు. అనుమానం రాకుండా సాగర్​ బైక్​ మీద నుంచి పడిపోయాడని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  అయితే  కేసులో కీలకమైన మరో ఇద్దరిని తప్పించారనే ప్రచారం జరుగుతోంది.  నిందితులను అరెస్టు చేసి వాళ్లు ఉపయోగించిన బైక్​లు, టాటా ఎస్​ ట్రాలీ, నాలుగు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.  కేసు ఛేదించి నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన సీఐ, ఎస్ఐ హెడ్​ కానిస్టేబుళ్లను డీసీపీ అభినందించారు.