- ఏడాదిగా పనిచేయని రెండో యూనిట్.. రిపేర్ల పేరుతో కాలయాపన
- రోటర్ స్పైడర్ లో సాంకేతిక లోపం..పట్టించుకోని జెన్ కో ఆఫీసర్లు
- రోజుకు 100 చొప్పున ఇప్పటివరకు 7,500 మెగావాట్ల విద్యుత్ నష్టం
- రిజర్వాయర్ నుంచి వృథాగా పోతున్న నీరు
నల్గొండ/హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లో పుష్కలంగా నీరు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదు. రిజర్వాయర్ లోకి వరద రాకముందే పవర్ యూనిట్లకు రిపేర్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సిన జెన్ కో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడంతో ఓ యూనిట్ పనిచేయడం మానేసింది. దీంతో ఓ వైపు నీరు వృథాగా పోతుండగా, మరో వైపు ప్రతి రోజు వంద యూనిట్ల విద్యుత్ కోల్పోవాల్సి వస్తోంది.
రెండో యూనిట్ లో సాంకేతిక లోపం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తం ఎనిమిది యూనిట్లను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ కు వరద వచ్చిన టైంలో అన్ని యూనిట్లను నడిపించడం వల్ల ఒక్కో యూనిట్ లో 100 మెగావాట్ల చొప్పున ప్రతి రోజు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ రిజర్వాయర్ వద్ద గల రెండో యూనిట్ లోని రోటర్ స్పైడర్ లో ఏడాది కింద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ యూనిట్ అప్పటి నుంచి పనిచేయడం మానేసింది. యూనిట్ కు రిపేర్లు పూర్తి చేయాల్సిన జెన్ కో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఏడు యూనిట్లలోనే ఉత్పత్తి జరుగుతోంది.
ఇప్పటివరకు 7,500 మెగావాట్ల నష్టం
కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు భారీస్థాయిలో వరద చేరింది. దీంతో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించారు. కానీ రెండో యూనిట్ లోని సమస్యను పరిష్కరించకపోవడంతో అది పని చేయడం మానేసింది. ఆ యూనిట్ లో రోజుకు 100 మెగావాట్ల చొప్పున రెండున్నర నెలల్లో 7,500 మెగావాట్ల విద్యుత్ ను నష్టపోవాల్సి వచ్చింది. వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే విద్యుత్ ఉత్పాదనతో పాటు నీటి వృథాను తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ రెండో యూనిట్ పనిచేయని కారణంగా సాగర్ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని వృథాగా దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండినప్పటికీ, ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిపేర్లు చేయాలని చెప్పినా పట్టించుకోలే..
నాగార్జునసాగర్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్ట్ 13న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి స్థితిగతులపై రివ్యూ నిర్వహించారు. రోటర్ స్పైడర్ లో లోపం కారణంగా పనిచేయని రెండో యూనిట్ కు సత్వరమే రిపేర్లు చేయించాలని సూచించారు. రెండో యూనిట్ ను సెప్టెంబర్ 18 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. కానీ ఆఫీసర్లు మాత్రం ఆ దిశగా సీరియస్ ప్రయత్నాలు చేయకపోవడంతో ఆ యూనిట్ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి రెండో యూనిట్ రిపేర్లు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే యూనిట్ కు రిపేర్లు పూర్తి చేయాలంటే జపాన్ నుంచి నిపుణులు, సాంకేతిక పరికరాలు రావాలని జెన్ కో ఆఫీసర్లు చెబుతున్నారు.