- వృథాగా దిగువకు పోయిన 200 టీఎంసీలు
- అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చెడిపోయిన మోటార్
- రెండు నెలలు గడుస్తున్నా పూర్తి కాని పనులు
- నల్గొండ జిల్లాలో 1,521 చెరువులకు చేరని కృష్ణా జలాలు
- అగమ్యగోచరంగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు
నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారినప్పటికీ నల్గొండ జిల్లాలోని చెరువుల్లోకి మాత్రం చుక్క నీరు చేరడం లేదు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీటిని ఎత్తిపోసే మోటార్ చెడిపోవడంతో దాని పరిధిలోని ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు అగమ్యగోచరంగా మారింది.
కాలం చెల్లిన మోటార్లు
ఏకేబీఆర్ వద్ద 23 ఏండ్ల కింద బిగించిన మోటార్లకు కాలం చెల్లిపోయింది. మొత్తం నాలుగు మోటార్లు బిగించగా ఒక్కో మోటర్ 600 క్యూసెక్కుల చొప్పున నాలుగు మోటర్లు 2,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఈ నాలుగు మోటార్లు కంటిన్యూగా నడిస్తేనే అటు హైదరాబాద్‌కు తాగునీరు, ఇటు నల్గొండ ఏఎమ్మార్పీ కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఒక మోటారు చెడిపోవడంతో మిగిలిన మూడు మోటార్ల ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.
ఇందులో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 600 క్యూసెక్కులు వెళ్తుండగా, మిగిలిన 1,200 క్యూసెక్కులు నల్గొండ జిల్లా అవసరాలకు వాడుతున్నారు. దీంతో ఏఎమ్మార్పీ కింద ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలు, దాని పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలు అస్త్యవ్యస్తంగా మారడంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఏకేబీఆర్ వద్దే రెండు నెలల కిందే మోటారు చెడిపోయినప్పటికీ దానిని ఆలస్యంగా గుర్తించిన జెన్‌కో ఆఫీసర్లు సకాలంలో రిపేర్లు చేయలేదు. దీంతో సాగర్‌లో 590 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నా ఏఎమ్మార్పీ పరిధిలోని చెరువులను నింపే అవకాశం లేకుండా పోయింది. నల్గొండ ఆయకట్టుకు ఆన్‌అండ్‌ఆఫ్ సిస్టమ్‌లో నీళ్లు వదులుతున్నారు.
ఒక్క మోటార్ రిపేర్‌కే మూడు నెలలు
ఏకేబీఆర్‌లో చెడిపోయిన ఒక్క మోటారును రిపేర్ చేసేందుకే ఆఫీసర్లకు మూడు నెలల టైం పట్టింది. నీటిని ఎత్తిపోసే మోటార్ లోపల వైబ్రేషన్స్ వచ్చి ఇన్‌పెల్లర్, గైడ్‌వేల్ దెబ్బతిన్నాయి. ఈ మోటార్‌ను మొత్తం విప్పడానికే రెండు నెలల టైం పట్టింది. తిరిగి మళ్లీ బిగించడానికి నెల రోజుల టైం పడుతుంది. ఇప్పుడు మోటారు బిగించే పనులు జరుగుతున్నాయి.
ఏకేబీఆర్, జెన్‌కో ఆఫీసర్లు అక్కడే మకాం వేసి మరీ పనులు చేయిస్తున్నారు. అయినప్పటికీ చెడిపోయిన మోటార్‌లో కొన్ని పరికరాలు బయట లభించకపోవడంతో ప్రత్యేకంగా తయారు చేయించాల్సి వస్తోంది. దీంతో నాలుగో మోటారు పనిచేయడానికి మరో 20 రోజుల టైం పడుతుందని ఆఫీసర్లు చెపుతున్నారు.
వృథాగా 200 టీఎంసీలు
23 ఏండ్ల కింద బిగించిన మోటార్లు ఒక్కసారిగా రిపేర్‌కు రావడంతో మోటార్ అసలు గుట్టు బయటపడింది. ఇప్పటివరకు చిన్నాచితకా రిపేర్లు వస్తే ఏదోరకంగా సరిచేసి నడిపించారు. కానీ ఇప్పుడు ఏకంగా పెద్ద మోటారే చెడిపోయింది. ఏకేబీఆర్ మోటార్ల మెయింటెనెన్స్‌ను జెన్‌కో చూస్తోంది. ఈ నెల 2న సాగర్ ఎడమకాల్వకు నీటిని వదిలే సమయానికే మోటార్ పనిచేయడం లేదు. సాగర్ వరద ఉధృతిని అంచనా వేయలేని జెన్‌కో ఆఫీసర్లు సమస్య తీవ్రతను గుర్తించడంలో విఫలం అయ్యారు.
ఈ నెల 5న సాగర్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారు. 5 నుంచి 18 వరకు 200 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో సోమవారం గేట్లు మూసేశారు. అదే ఏకేబీఆర్ మోటార్‌ను సకాలంలో రిపేరు చేసినట్లయితే వృథాగా పోయిన నీటితో జిల్లాలోని చెరువులను నింపే అవకాశం ఉండేది. సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
107 చెరువుల్లోనే నీళ్లు
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలు, చెరువులు, బోర్ల కింద మొత్తం సుమారు ఐదు లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇందులో వరి, బత్తాయి, పత్తిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వానలు ఆలస్యమైనప్పటికీ సాగర్ పూర్తిగా నిండడంతో చెరువుల్లోకి నీళ్లు వస్తాయని ఏఎమ్మార్పీ రైతాంగం ఊపిరి పీల్చుకుంది. కానీ జిల్లాలోని చెరువుల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు చేరలేదు. జిల్లాలో మేజర్, మైనర్ అన్నీ కలిపి మొత్తం 1,628 చెరువులు ఉండగా ఇప్పటివరకు కేవలం 107 చెరువుల్లోకి మాత్రమే 50 నుంచి 100 శాతం నీళ్లు చేరాయి.
ఇంకా 1,521 చెరువులు నింపాల్సి ఉంది. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు ఆనుకునే డిస్ట్రిబ్యూటరీలు, ఉదయ సముద్రం రిజర్వాయర్, అయిటిపాముల ప్రాజెక్ట్ ఉంది. ప్రస్తుతం ఏకేబీఆర్ నుంచి వచ్చే 1,200 క్యూసెక్కుల నీరు నేరుగా ఉదయసముద్రం, దానికి ఆనుకుని ఉన్న డిస్ట్రిబ్యూటరీలకే చేరుతోంది. చివరి ఆయకట్టు రైతులకు, మిర్యాలగూడ, నల్గొండ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో చివర ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు నీరు చేరడం లేదు. దీంతో పలు చోట్ల రైతులు మెయిన కెనాల్‌కు అడ్డంగా తాటిమొద్దులు, రాళ్లు పెట్టడంతో పాటు తూములు ధ్వంసం చేసి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.