డబ్బులు తీసిస్తామని కార్డులు మార్చి.. ఏటీఎంలలో మోసాలు చేస్తున్న సహాని గ్యాంగ్​ అరెస్ట్​

డబ్బులు తీసిస్తామని కార్డులు మార్చి..  ఏటీఎంలలో మోసాలు చేస్తున్న  సహాని గ్యాంగ్​ అరెస్ట్​
  • నగరంలో 15 చోట్ల ఈ తరహా చీటింగ్స్​
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

షాద్ నగర్, వెలుగు: ఏటీఎం నుంచి డబ్బులు తీసిస్తామని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న ముఠాను షాద్​నగర్​, శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కరిమాన్ సహాని (33), రూప్​దేవ్​సహాని (34), సాహిబ్ సహాని( 34) శంషాబాద్​లో ఉంటున్నారు. ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఏటీఎంల వద్ద మాటు వేసి అమాయకులను డబ్బులు తీసి ఇస్తామని నమ్మబలుకుతారు. 

వారి కార్డు తీసుకుని ఫేక్​  కార్డు పెట్టి డబ్బులు రావడం లేదని చెప్పి పంపిస్తారు. తర్వాత ఒరిజినల్​ కార్డులతో ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఈ నెల 5న నందిగామ మండలం శ్రీనివాసులుగూడానికి చెందిన కుమ్మరి రాజు షాద్ నగర్ లోని జడ్చర్ల రోడ్డులో ఉన్న ఐడీబీఎం ఏటీఎంకు వచ్చాడు. అతడికి డబ్బులు తీసే పద్ధతి తెలియకపోవడంతో వెనక నిలబడి ఉన్న ఓ వ్యక్తి తాను తీసిస్తానని చెప్పాడు. కార్డు తీసుకుని చెక్ చేసినట్లు నటించి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చాడు. 

తర్వాత రాజు ఇంటికి వెళ్లగా అతడి అకౌంట్​నుంచి వరుసగా ఐదు సార్లు 42 వేల 400 రూపాయలు తీసినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి అడగ్గా అతడి ఏటీఎం కార్డు నుంచి ఎవరో తీసి ఉంటారని చెప్పారు. దీంతో తనను మోసం చేసి, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నారని షాద్​నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. షాద్ నగర్ పోలీసులు, శంషాబాద్​ఎస్​వోటీ పోలీసులు కలిసి సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్​ చేశారు. 

నిందితులు ఇలా నగరంలోని 15 చోట్ల దొంగతనాలు చేశారని, రూ. 2, 38 లక్షల నగదు,140 ఫేక్​ ఏటీఎం కార్డులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు. షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్, ఎస్వోటి సీఐ సంజయ్ క్రైమ్ డీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శరత్ కుమార్ సిబ్బంది ఉన్నారు.