సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూశారు. 2023 నవంబర్ 14వ తేదీన రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సహారా గ్రూప్ వెల్లడించింది. సుబ్రతా రాయ్ కొంతకాలంగా మెటాస్టాటిక్ కేన్సర్, హై బీపీ, డయాబెటీస్ తో బాధపడుతున్నారు. 1948 జూన్ 10న బీహార్‌లో జన్మించిన సుబ్రతా రాయ్.. సహారా గ్రూప్‌ను స్థాపించి ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, ఆతిథ్య రంగాల్లో వ్యాపారాలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు.
1978లో సహారా ఇండియా పరివార్ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2 వేల పెట్టుబడితో ప్రారంభించినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. భారతదేశ చరిత్రలో ఇండియన్ రైల్వే తర్వాత.. ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థగా సహారా నిలిచింది. అప్పట్లోనే నెలకు 12 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ కారణాలతో సహారా గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. 75ఏళ్ల సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్.. ఇద్దరు కుమారులు.. సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ ఉన్నారు. ప్రస్తుతం వారు విదేశాల్లో నివసిస్తున్నారు.