PSL 2025: పాకిస్థాన్ బ్యాటర్ సంచలనం.. సెంచరీలతో కోహ్లీ, బట్లర్, గేల్ రికార్డ్ సమం

PSL 2025: పాకిస్థాన్ బ్యాటర్ సంచలనం.. సెంచరీలతో కోహ్లీ, బట్లర్, గేల్ రికార్డ్ సమం

పాకిస్తాన్ క్రికెటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ టీ20 క్రికెట్ లో తన హవా చూపిస్తున్నాడు. ముఖ్యంగా 2025 లో పొట్టి ఫార్మాట్ లో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. తన అసాధారణ ఫామ్ తో ఒకే క్యాలెండర్ ఇయర్ లో నాలుగు సెంచరీలు చేసి స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్, క్రిస్ గేల్‌ల సరసన చేరడం విశేషం. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సాహిబ్‌జాదా ఫర్హాన్.. పెషావర్ జల్మిపై సోమవారం (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 

ఈ మ్యాచ్ లో కేవలం 52 బంతుల్లో 203.85 స్ట్రైక్ రేట్‌తో 106 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 13 బౌండరీలు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో క్యాలెండర్ ఇయర్ లో నాలుగు టీ20 సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్  యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 2011లో తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. 2016లో 'రన్ మెషిన్' విరాట్ కోహ్లీ ఈ జాబితాలో చేరగా..  ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ 2022లో.. శుభ్‌మన్ గిల్ 2023లో ఈ అరుదైన ఫీట్ అందుకున్నారు. 

►ALSO READ | IPL 2025: ఇది మామూలు దెబ్బ కాదు: పంజాబ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి వరల్డ్ క్లాస్ పేసర్ ఔట్

సాహిబ్జాదా ఈ సంవత్సరం తన తొలి సెంచరీని పెషావర్ రీజియన్ తరపున ఆడుతున్నప్పుడు సాధించాడు. మార్చి 15న అతను 59 బంతుల్లో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత వారం రోజుల్లోనే క్వెట్టాపై జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 162 పరుగులు.. పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో అబోటాబాద్‌తో 72 బంతుల్లో 148 పరుగులు చేసి మరోసారి సెంచరీ సాధించాడు. నాలుగో సెంచరీ సోమవారం (ఏప్రిల్ 14) పెషావర్ జల్మిపై బాదాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.