హైదరాబాద్: ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఎండీ బూదటి లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుకు సంబంధించి మరిన్నీ విషయాలు రాబట్టేందుకు లక్ష్మీనారాయణను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఈడీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం లక్ష్మీనారాయణను ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఇవాళ (అక్టోబర్ 7) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల (అక్టోబర్ 7) 14 నుండి 18 వరకు లక్ష్మీనారాయణను ఈడీ విచారించనుంది.
అసలేం జరిగిందంటే..?
సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లక్ష్మీనారాయణ సహా మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. వరల్డ్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అంటూ కొనుగోలుదారులకు ప్రీ లాంచ్ ఆఫర్ ఇచ్చారు. దాదాపు 700 మందికి పైగా కస్టమర్ల దగ్గర నుండి రూ.360 కోట్లు వసూలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం.. ప్లాట్స్, విల్లాస్ పూర్తి చేసి ఇస్తామన్నారు. లేకుంటే డబ్బు రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బును లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్‌కు దారి మళ్లించారు.
ALSO READ | జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా..? హరీష్ రావు
దీంతో బాధితులు సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ ఆరోపణలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రూ.161.5 కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్, డిజిటల్ డాక్యుమెంట్స్‌ను సీజ్ చేశారు.