హైదరాబాద్, వెలుగు: సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఎండీ బూదటి లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ నెల 14 నుంచి 18 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయనను కస్టడీలో విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.
రూ.360 కోట్లు మనీలాండరింగ్ కేసులో లక్ష్మీనారాయణను ఈడీ గత ఆదివారం అరెస్ట్ చేసింది. వల్డ్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్ చేసి రూ.1500 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు సిటీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసి, రూ.161.5 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. గత నెల 29న అదుపులోకి తీసుకుని 30వ తేదీన కోర్టులో హాజరుపరిచారు.