జీవితం అంటే కష్టాలను దాటి ముందుకెళ్లడమే: సాయిధరమ్ తేజ్

జీవితం అంటే కష్టాలను దాటి ముందుకెళ్లడమే: సాయిధరమ్ తేజ్

1989–91 మధ్య జరిగే కథ ఇది. రుద్రవరం అనే గ్రామంలో  వరుసగా జరిగే మిస్టరీ డెత్‌‌లకు కారణం ఏంటి?  ఊరి మీద ఎవరైనా చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ. ‘విరూపాక్ష’ అంటే రూపం లేని కన్ను. శివుడి మూడో కన్ను అని కూడా అంటారు. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మొదటిసారి ఇలాంటి కొత్త జానర్‌‌ చేశాను. నా గత సినిమాల్లో జీవించాను.. కానీ ఇందులో మాత్రం నటించాను. ప్రతీ హీరోకి తన ప్రతీ సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది. అలానే కష్టపడతారు.
    80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో తెలుసుకున్నాను. అవన్నీ రీసెర్చ్ చేశాం. సెట్‌‌లో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అన్ని భయాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది నేను నమ్ముతాను. నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. 
    కార్తీక్ కథ చెప్పిన విధానం ఆకట్టుకుంది. సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్‌‌గా లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్‌‌కే అర్థం అవుతుంది. ఇలాంటి  టిపికల్ జానర్‌‌‌‌కు సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే హైలైట్‌‌గా ఉంటుంది. 
    సంయుక్త నిజంగానే గోల్డెన్ లెగ్. ఆమె నటించిన చిత్రాలు వరుస హిట్స్ సాధించాయి.  ఏ పాత్రకు ఎంత చేయాలో ఆమెకు బాగా తెలుసు. చాలా మంచి నటి. ఆమె ఆలోచన ధోరణి గొప్పగా ఉంటుంది. ఇందులో పాటలకు స్కోప్‌‌ లేదు. ఒక్క పాట మాత్రమే ఉంటుంది. అజనీష్ లోక్‌‌నాథ్​ ఇచ్చిన బ్యాక్‌‌గ్రౌండ్‌‌ స్కోరుతో ఆడియెన్స్ థ్రిల్ ఫీలవుతారు.  
    ఈ బ్యానర్‌‌‌‌లో వర్క్ చేయడం కంఫర్ట్‌‌గా ఉంటుంది.  నిర్మాత ప్రసాద్ గారు, బాపీ అన్న.. నేను ఇండస్ట్రీలోకి రాక ముందే తెలుసు. ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నా. మన తెలుగుదనాన్ని పాన్ ఇండియాకు తీసుకెళ్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్నాం. అందుకే ముందు తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. తర్వాత అన్ని భాషల్లో విడుదల చేస్తాం. 
    ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ నాకు మళ్లీ 36 ఏళ్ల వయసులో మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్‌‌గా నిలిచారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి. 
    జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తర్వాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి' అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌‌ను పంపించారు.
తన జీవితం అన్నీ సవాళ్లతోనే నిండిందని, ఎప్పుడూ కొత్త చాలెంజెస్‌‌ని స్వీకరించేందుకు సిద్దంగానే ఉంటానంటున్నాడు సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్‌‌ తర్వాత తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన విశేషాలు.