తనదైన నటనతో యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీస్‌కు దగ్గరైంది సాయి పల్లవి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుందనే న్యూస్ కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సీతగా సాయి పల్లవి నటించడం కన్ఫామ్ అని తెలుస్తోంది.
‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా ‘రామాయణం’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్ పేర్లు వినిపించగా, ఫైనల్‌గా సాయి పల్లవిని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని ముంబైలోని ఓ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారట. తాజాగా సాయి పల్లవి ముంబైలో కనిపించడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తోంది.
అలాగే ఈ మూవీకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రంగంలోకి దిగారు. ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి ఈ భారతీయ రామాయణానికి మ్యూజిక్ చేయడానికి సిద్ధమయ్యారట. వీరిద్దరూ కలిసున్న ఫొటోతో పాటు ముంబైలో ఉన్న సాయి పల్లవి ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను శ్రీరామనవమి రోజున ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు 12 భాషల్లో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని, అల్లు అరవింద్, మధు మంతెనతో పాటు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.