ఆర్థిక ఇబ్బందులతో మిషన్ భగీరథ ఆపరేటర్ సూసైడ్
నెలనెలా జీతం రాకపోవడం, అనారోగ్యంతో మనస్తాపం
పిల్లలను సాకలేక చనిపోతున్నట్టు సూసైడ్ నోట్
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని సాయి ప్రతాప్ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో మిషన్ భగీరథ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం అల్వాలకు చెందిన పుష్పలత(26)కు నల్గొండ మండలం పానగల్‌కు చెందిన సింగం మహేశ్‌తో 8 ఏండ్ల కింద పెండ్లి అయింది. వీరికి కూతురు సాన్విత , కొడుకు సాయి నందన్ ఉన్నారు. పానగల్ వద్ద ఉన్న మిషన్ భగీరథ 35 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న పుష్పలత భర్త మహేశ్ ఏడాది కింద సూసైడ్ చేసుకున్నాడు. అతడి స్థానంలో పుష్పలతకు ఉద్యోగం వచ్చింది. ఈమె మూడు నెలలుగా హాలియా పట్టణంలోని సాయి ప్రతాప్ నగర్‌లో నివాసముంటోంది.
నెలకు రూ. 9,500 జీతం ఇవ్వాల్సి ఉండగా, అది కూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తుండడంతో ఇద్దరు పిల్లల్ని సాకలేక ఆర్థిక ఇబ్బందులకు పడుతోంది. ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో ట్రీట్మెంట్కు రూ .2 లక్షల ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆవేదన చెందింది. గురువారం రాత్రి తాను అద్దెకు తీసుకుని ఉంటున్న రూమ్ లో ని ఫ్యాన్ కు ఉరేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, నెల జీతం సరిగ్గా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. మృతురాలు మేనమామ సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. కాగా, పుష్పలత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి పిల్లలను, కుటుంబసభ్యులను ఓదార్చారు. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. భగీరథ కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని, ఆమె పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.