GT vs CSK: ఐపీఎల్‌లో దంచి కొడుతున్న సాయి సుదర్శన్.. సచిన్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

GT vs CSK: ఐపీఎల్‌లో దంచి కొడుతున్న సాయి సుదర్శన్.. సచిన్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ యువ ప్లేయర్ సాయి సుదర్శన్ సూపర్ ఫామ్ కొనసాగుతుంది. 2023 సీజన్ లో కేవలం రూ. 20 లక్షలకు గుజరాత్ జట్టులోకి చేరి సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన సుదర్శన్ ప్రస్తుత సీజన్ లో అంతకు మించిన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం (మే 10) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సాయి సుదర్శన్ సెంచరీతో కదం తొక్కాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 103 పరుగులు చేసి ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 

ఈ సీజన్ లో 500 కు పైగా పరుగులను పూర్తి చేసిన ఈ యువ సంచలనం..ఈ క్రమంలో ఏకంగా ఐపీల్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ గా నిలిచాడు. డారిల్ మిచెల్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లతో సహా తొమ్మిది పరుగులు చేసి ఈ మార్క్ అందుకున్నాడు.  31 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1000 పరుగులు పూర్తి చేస్తే .. కేవలం 25 ఇన్నింగ్స్‌లలో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించడం విశేషం.
            
ఓవరాల్‌గా ఐపీఎల్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల లిస్టులో  సాయి సుదర్శన్ మాథ్యూ హేడెన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకొని ఓవరాల్ గా ఈ లిస్టులో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు సాయి సుదర్శన్ 12 ఇన్నింగ్స్ ల్లో 527 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ (623), గైక్వాడ్ (541), హెడ్ (533) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.