ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలతో.. ఒకేసారి రెండు ఇండస్ట్రీల్లో అరంగేట్రం చేసింది. వాటితో గుర్తింపు రావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఆమెకు రాలేదు. ఆమెవరో కాదు.. సాయి తమ్హంకర్. మరాఠీ, హిందీ సినీ, టీవీ ఇండస్ట్రీల్లో పాపులర్ యాక్ట్రెస్‌గా పేరుగాంచిన నటి. ప్రస్తుతం ఓటీటీల్లోనూ ఆమె హవా బాగా నడుస్తోంది. మీడియం ఏదైనా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చి మెస్మరైజ్ చేస్తోంది.
అయితే కెరీర్లో ఫలానా పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల రోల్స్ ట్రై చేసింది సాయి. అటు మరాఠీ, ఇటు హిందీ ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేధార్’ అనే సిరీస్‌తో మరోసారి థ్రిల్ చేయబోతోంది. ఆమె జర్నీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి.
మహారాష్ట్రలోని సాంగ్లీ గ్రామంలో పుట్టింది సాయి. మృణాళిని, నందకుమార్ తమ్హంకర్.. సాయి అమ్మానాన్నలు. అక్కడే సావర్కర్ ప్రతిస్థాన్ స్కూల్లో చదువుకుంది. తర్వాత చింతామన్ కాలేజీ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. స్కూల్ చదివే రోజుల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండేది. స్పోర్ట్స్‌లో ఎప్పుడూ ముందుండేది. ఆమె స్టేట్ లెవల్ కబడ్డీ ప్లేయర్ కూడా. కాలేజీలో చదివే రోజుల్లో వీధి నాటకాల్లో నటించింది.
అక్కడే ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. ఆ టైంలో ఆమె నటించిన ‘ఆధే ఆధురె’ నాటకానికి అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ ఫంక్షన్ తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ‘యా గోజిరన్యా ఘరట్’ అనే మరాఠీ సీరియల్లో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దాంతో నటనను కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకుంది. అందుకు తగ్గట్టే సీరియల్ హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. అలా ఆగ్ని షికా, సాథి రే, కస్తూరి వంటి సీరియల్స్‌లో నటించింది. ఫు భాయ్ ఫు అనే షోకి యాంకరింగ్ కూడా చేసింది.
ఒకేసారి నాలుగు సినిమాలు
బాలీవుడ్లో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో సినిమా జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా 2008లో విడుదలైంది. అదే ఏడాది మరాఠీలో ‘సనయ్ ఛౌగడే’ అనే సినిమా కూడా వచ్చింది. అలా ఒకే సంవత్సరంలో రెండు ఫిల్మ్ ఇండస్ట్రీల్లో అరంగేట్రం చేసింది. అయితే వీటితోపాటు ఆమె నటించిన ‘పిక్నిక్’, ‘ఘజిని’ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆమె నటించిన సినిమాలు ఏడాదికి నాలుగు చొప్పున విడుదలయ్యేవి. అందులో హీరోయిన్ లేదా లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు.. సపోర్టింగ్ రోల్స్‌లోనూ నటించింది.
ఆమె నటించిన వాటిలో ‘క్లాస్ మేట్స్’ సినిమాలో టామ్‌బాయ్ క్యారెక్టర్, ‘అనుబంధ్’ అనే సీరియల్లో సరోగేట్ మదర్ వంటి ప్రత్యేకమైన పాత్రలున్నాయి. కొన్ని పాత్రలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెడితే, మరికొన్ని మాత్రం విమర్శలు ఎదుర్కొన్నాయి.
ఒక వ్యక్తిగా నాకు నేను అందంగా ఉన్నానని అంగీకరిస్తాను. పని విషయానికొస్తే.. నేను వర్క్‌హాలిక్‌గా ఉండాలి అనుకుంటా. దాంతోపాటే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటా. షూటింగ్ ఒకవేళ లాంగ్ షెడ్యూల్ ఉందంటే.. అందులో నాకోసం రెండు రోజులు ఉండేలా చూసుకుంటా. ఆ టైంలో ఇంటి పనులు చేసుకోవడం, రిలాక్స్ అవ్వడానికి కేటాయిస్తా. ఇంకా అంత బ్యాలెన్స్ చేసే సామర్థ్యం రాలేదు. కానీ, నెమ్మదిగా అయినా ఆ లక్ష్యాన్ని చేరుకుంటా. ఎందుకంటే బ్రెయిన్‌కి కూడా రెస్ట్ అవసరం. ఈ విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నా.
అయితేనేం చాలా హ్యాపీగా ఉన్నా. నేను పదిహేడేండ్లకే ఇండస్ట్రీకి వచ్చా. అంటే చాలా చిన్నవయసులోనే పనిచేయడం మొదలుపెట్టా. అప్పుడు నాకు కష్టంగా అనిపించినప్పటికీ నన్ను బలంగా, ఇండిపెండెంట్‌గా మార్చింది. కష్టాలు లేకపోతే లైఫ్‌లో ఫన్ ఏం ఉంటుంది? నాకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో ఎంజాయ్ చేశా. నా ఫ్యామిలీ నన్ను చూసి ఆశ్చర్యపోయింది.
కెరీర్ స్టార్ట్ చేయకముందు నా పేరెంట్స్ నాతో ఏం చెప్పారంటే.. ‘మేం డొనేషన్స్ అడగం. నీ చదువు కోసం ఎవరికీ లంచం ఇవ్వలేదు. నీ పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వే సరిదిద్దుకోవాలి. కానీ నువ్వేం చేసినా సపోర్ట్ చేస్తాం’ అన్నారు. అయితే నేను వెళ్లి యాక్టర్ అవుతానని చెప్పా. అప్పుడు మా అమ్మ కాస్త ఎమోషనల్ అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ల సపోర్ట్ నాకుంది.
ది సీక్రెట్ ఆఫ్ ది శిలేధార్స్...
ఈ సిరీస్‌లో ఒక మంచి రోల్ చేశా. నా క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉంటాయి. ఇందులో నా పాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి పాత్రలు తరచూ రావు. అందుకే నేను ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ఇది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. షూటింగ్ వేర్వేరు లొకేషన్స్‌లో జరిగింది. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఎన్నో విషయాలు చెప్పాల్సి వచ్చేది. అలాంటప్పుడు షూటింగ్ సవాలుగా అనిపించేది.
ప్రతి రోజు కొత్తగానే ఉండేది. నాతోపాటు నటించిన రాజీవ్ కూడా చాలా కష్టపడి పనిచేశాడు. కొన్నిసార్లు కష్టమైన సీన్స్‌ని డూప్‌తో చేయిద్దామని చెప్పినా తనకు తానుగా రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ పూర్తి చేశాడు. అతను చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. మంచి వ్యక్తి కూడా. ఈ సిరీస్ షూటింగ్ జర్నీ అంతా థ్రిల్లింగ్‌గా, ఛాలెంజింగ్‌గా సాగింది. కొన్నిసార్లు భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం.
‘నవరస’ సిరీస్‌లో..
ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఒకే ఏడాది రెండుసార్లు కనిపించిన మరాఠీ యాక్ట్రెస్‌గా గుర్తింపు దక్కింది.
మలయాళం, తమిళం రెండు భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘సోలో’లో ఒక సెగ్మెంట్లో సాయి నటించింది.
2017 నుంచే ఓటీటీ సినిమాలు, సిరీస్‌లలో నటిస్తోంది. వాటిలో తమిళంలో మణిరత్నం తీసిన ‘నవరస’ సిరీస్‌లో కూడా నటించింది.
స్పీర్ట్స్ మీద ఉన్న ప్రేమతో జీ మహారాష్ట్ర కుస్తీ దంగల్ (జెడ్ఎంకెడి)లో ‘కొల్హాపురి మాల్వె’ పేరుతో రెజ్లింగ్ టీం ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం మరాఠీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటీనటుల్లో ఈమె ఒకరు.