సైఫ్ను పొడిచిన దొంగ ఇతడేనట.. ఛత్తీస్గఢ్లో ట్రైన్లో పట్టుకున్నారు..

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను పొడిచిన వ్యక్తి దొరికిపోయాడు. డ్రెస్సులు మార్చి.. ఎవరూ గుర్తు పట్టకుండా ముంబైలో తిరిగిన వ్యక్తి.. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసే సరికి.. ఇక ముంబై సేఫ్ కాదని లగేజ్ సర్దుకొని ముంబైనుంచి చెక్కేశాడు. సైలెంట్ గా ట్రైన్ లో ఎవరికీ డౌట్ రాకుండా మాయమయ్యాడు. కానీ ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఫోటోస్ అన్ని రైల్వే స్టేషన్స్ కు పంపడంతో.. పోలీసులు నిఘా పెట్టి పట్టేసుకున్నారు. 

సైఫ్ ను పొడిచిన దొంగను శనివారం (18 జనవరి 2025) ఛత్తీస్ గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పట్టుకుంది. అతి దారుణంగా పొడిచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న దొంగ పేరు ‘ఆకాశ్ కైలాశ్ కన్నోజియా(31)’. జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా ఛత్తీస్ గఢ్ లోని దుర్గ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. దుండగుడు ట్రైన్ లో వస్తున్నాడని ముంబై పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పట్టుకున్నారు. 

అయితే నిందితుడిని పట్టుకున్న వెంటనే రైల్వే పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తను ముంబైకి చెందిన వాడినని, బిలాస్ పూర్ లో చుట్టాలను కలిసేందుకు వెళ్తున్నట్లుగా చెప్పాడట. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ దిరికిపోయిన ఈ దొంగ ముంబైలోని కొలబా ఏరియాకు చెందిన వాడు. 

దొంగ దొరికాడనే సమాచారం రావడంతో ముంబై పోలీసులు ఛత్తీస్ గఢ్ కు బయల్దేరారు. ముంబై పోలీసులు వచ్చిన తర్వాత అనుమానిస్తున్నట్లుగా సైఫ్ ను పొడిచింది ఇతడేనా కాదా అనేది నిర్ధారించనున్నారు. ముంబై పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫోటో ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లో దొరికిన వ్యక్తే అతడని అంటున్నారు. కానీ పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. ముంబైకి తీసుకొచ్చి విచారణ చేపట్టనున్నారు పోలీసులు. 

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది.