సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‎కు షర్మిల కృతజ్ఞతలు

సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‎కు షర్మిల కృతజ్ఞతలు

ముంబై: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. నేరుగా సైఫ్ ఇంట్లోకి దూరిన దుండగుడు హీరోపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీ ఖాన్‎ను ఆటో డ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణా తన ఆటోలో ఆసుపత్రికి తరలించాడు. ప్రమాద సమయంలో అండగా నిలిచిన ఆటో డ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాకు హీరో సైఫ్ అలీ ఖాన్ థ్యాంక్స్ చెప్పారు. 

ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన సైఫ్.. మంగళవారం (జవనరి 21) డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఆసుపత్రిలో డ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాను కలిశాడు సైఫ్. ఈ సందర్భంగా డ్రైవర్ రాణాను కౌగిలించుకుని సైఫ్‌ అలీ ఖాన్ థ్యాంక్స్‌ చెప్పారు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఆటో డ్రైవర్‎కు కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలపై ఇరువురు మాట్లాడుకున్నారు. అనంతరం సైఫ్, ఆటో డ్రైవర్ ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా డ్రైవర్ రాణా మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగిన రాత్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ రోజు రాత్రి నేను వెళ్తుండగా గేట్ నుండి శబ్దం వినిపించింది. ఒక మహిళ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఆటో ఆపు అంటూ కేకలు వేస్తోంది. మొదట్లో అతను సైఫ్ అలీ ఖాన్ అని నాకు తెలియదు. ఎవరో సాధారణ వ్యక్తే అనుకున్నా.  అతడు స్వయంగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చున్నాడు. 

ALSO READ | ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత..సైఫ్‌‌‌‌అలీఖాన్ డిశ్చార్జ్

అతనికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆయన వెంట ఒక చిన్న పిల్లవాడు, మరో వ్యక్తి ఉన్నారు. ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని సైఫ్ అడిగారు. పది నిమిషాలు పడుతుందని చెప్పాను. పది నిమిషాల్లో లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాం. వారి నుంచి నేను ఆటో ఛార్జీలు కూడా తీసుకోలేదు. ఆ సమయంలో నేను అతనికి సహాయం చేయగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది" అని డ్రైవర్ రాణా పేర్కొన్నాడు.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై బుధవారం (జవనరి 15) దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఈ ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించడం గమనార్హం.