Saif Ali Khan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్

Saif Ali Khan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్

సైఫ్ అలీఖాన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. ఇప్పుడు తనకు హీరో మాత్రం వేరే ఉన్నారు. ఆరు పదునైన కత్తి పోట్లతో చావు నుంచి బయటపడ్డాడంటే వైద్యుల చికిత్స మాత్రమే కాదు. తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఈ ఆటో డ్రైవర్‌ చతురత కూడా తోడ్పడింది.

జనవరి 16న సైఫ్పై కత్తితో దాడి జరిగిన తర్వాత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా. దాంతో ఆరు రోజుల్లోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగలిగాడు. ఈ క్రమంలో హీరో సైఫ్ అలీఖాన్ మంగళవారం (జనవరి 21న) లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు.. తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ భజన్ సింగ్ (Bhajan Singh Rana) రాణాను కలిశారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను సైఫ్ అలీ ఖాన్ ప్రేమతో కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాడు. నటుడు సైఫ్ అలీఖాన్ తో పాటు అతని తల్లి షర్మిలా ఠాగూర్ సైతం ఆటో డ్రైవర్‌ భజన్ సింగ్ రానాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇండియా టుడేతో మాట్లాడిన డ్రైవర్ భజన్ సింగ్ రాణా సంఘటన జరిగిన రాత్రిని గుర్తు చేసుకున్నారు. "ఆ రోజు రాత్రి నేను వెళ్తుండగా గేట్ నుండి శబ్దం వినిపించింది. ఒక మహిళ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఆటో ఆపు అంటూ కేకలు వేస్తోంది. సైఫ్ తన ఆటోరిక్షాలో ఎక్కిన వెంటనే ఆసుపత్రికి  చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడిగినట్లు చెప్పాడు. మొదట్లో, తన ఆటో ఎక్కింది హీరో సైఫ్ అలీ ఖాన్ అని తెలియదని.. ఎలాగైనా సకాలంలో ఆసుపత్రికి చేరేలా మాత్రమే ఆలోచించానని డ్రైవర్ తెలిపాడు.

ఇకపోతే.. సైఫ్ అలీఖాన్ తన ఆటో ఎక్కేముందు తీవ్ర రక్తస్రావంలో ఉన్నట్లు చెప్పాడు. సైఫ్ మెడ మరియు వీపు నుండి రక్తం కారుతోందని.. అతని తెల్లని కుర్తా పూర్తిగా రక్తంతో తడిచిందని చెప్పుకొచ్చాడు. అయితే, నేను సైఫ్ దగ్గర ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోలేదని చెప్పారు. ఆ సమయంలో నేను అతనికి సహాయం చేయగలిగినందుకు నాకు సంతోషంగా ఉందని డ్రైవర్ భజన్ సింగ్ రాణా వెల్లడించాడు.

అసలేం జరిగిందంటే:

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై బుధవారం (జవనరి 16) దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఈ ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.