ఎన్టీఆర్ 30.. ఆ పాత్రకు నో చెప్పి షాకిచ్చిన సైఫ్ అలీఖాన్?

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ పవర్ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఎన్టీఆర్ 30పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నో చెప్పాడట. యంగ్ టైగర్ ను ఢీ కొట్టే రోల్ ను వదులుకోవడానికి గల కారణాలపై మాత్రం సైఫ్ పెదవి విప్పలేదట.  ప్రభాస్ ఆదిపురుష్ లో విలన్ గా సైఫ్ నటిస్తున్నాడు. కానీ, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో రావణుడిగా సైఫ్ ను చూపించిన విధానం నెట్టింట చర్చకు దారి తీసింది. వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై  విమర్శలు రావడంతో దర్శకుడు ఓం రౌత్ దాన్ని చక్కదిద్దే పనిలో పడ్డాడు. 

ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో విలన్ కోసం అన్వేషణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉందంటూ నటుడు  ప్రకాశ్ రాజ్ ఇటీవల ట్వీట్ చేశాడు. కానీ, విలన్  గా కనిపించేది ఎవరనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అణచివేతకు గురైన తీర ప్రాంత నేపథ్యమున్న కథగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. దేవుడికి, చావుకు సైతం భయపడని మృగాలకు భయాన్ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించనున్నాడు దర్శకుడు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు స్వరాలను అందించనున్నాడు.