సైఫ్‌‌ అలీఖాన్‌‌కు కత్తిపోట్లు..అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు

  • యాక్టర్ మెడ, వెన్నెముక, ఎడమ చేతికి తీవ్ర గాయాలు 
  • ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలింపు
  • సైఫ్​కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ల వెల్లడి
  • నిందితుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు 

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా వెస్ట్‌‌‌‌లోని ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ వెన్నెముక, మెడ, ఎడమ చేయి సహా ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.  సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నర్సు ఇలియామా ఫిలిప్(56)..భయంతో కేకలు వేసింది. వెంటనే దుండగుడు ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నర్సు కేకలతో అక్కడికి చేరుకున్న  సైఫ్ దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దుండగుడు  కత్తితో దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే, కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ ను అతని పెద్ద కొడుకు ఇబ్రహీం.. ఆటోలో  ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించాడు. ట్రీట్మెంట్ అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. దాడిలో సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయమైనట్లు ప్రకటించారు. అక్కడ ఇరుక్కుపోయిన 2.5 అంగుళాల కత్తి ముక్కను సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. దీంతోపాటు వెన్నెముకలోని ద్రవాలు లీక్ కాకుండా సరిచేశామన్నారు. సైఫ్ ఎడమ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఐసీయూలో సైఫ్ కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం లేదన్నారు.  

నిందితుడి కోసం రంగంలోకి పది టీమ్ లు

సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో  నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి ఫొటోను రిలీజ్ చేశారు.   చోరీ కోసమే నిందితుడు సైఫ్ ఇంట్లోకి చొరబడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు వినియోగించే మెట్ల మార్గంలో సైఫ్ ఇంట్లోకి అతడు ప్రవేశించినట్లు చెప్పారు. సైఫ్ నివసించే హౌసింగ్ సొసైటీలో మరమ్మతులు జరుగుతున్నాయని, బయట నుంచి పనివారు వచ్చిపోతున్నారని వెల్లడించారు. దుండగుడు కొన్ని గంటలపాటు సైఫ్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో కలియ తిరిగాడని.. అతనికి సెక్యూరిటీ సిబ్బంది సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ముంబై సేఫ్ కాదనటం కరెక్ట్ కాదు: సీఎం ఫడ్నవిస్

సైఫ్ అలీఖాన్‌‌‌‌పై జరిగిన దాడిపై మహారాష్ట్ర ప్రతిపక్ష నేతలు, కొందరు  నటులు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సైఫ్ అలీ ఖాన్‌‌‌‌పై దాడి దురదృష్టకరమన్నారు. ముంబై సురక్షిత ప్రదేశం కాదనడం మాత్రం సరైనది కాదని తెలిపారు. దేశంలోని అన్ని మెగా సిటీలలో ముంబై అత్యంత సురక్షితమైనదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు.