- సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్టు
- 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు
- నిందితుడిది బంగ్లాదేశ్.. అక్రమంగా ఇండియాలోకి ప్రవేశం
ముంబై:బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతణ్ని బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసు వివరా లను ముంబై పోలీసులు ఆదివారం వెల్లడించారు.
నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించాడని, ఆ తర్వాత తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు.
‘‘నిందితుడి స్వస్థలం బంగ్లాదేశ్ లోని ఝాలోకటి. 30 ఏండ్ల వయసున్న అతడు అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించాడు. ఐదు నెలలుగా ముంబైలో ఉంటున్నాడు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. నిందితుడిని ఆదివారం ఉదయం థానె దగ్గర్లోని హీరానందని ఎస్టేట్ లో పట్టుకున్నాం” అని చెప్పారు.
‘‘దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడు చొరబడ్డాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని అతనికి తెలియదు” అని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడు ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు? అందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చాడు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, నిందితుడు బిజోయ్ దాస్ ను పోలీసులు బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిది బంగ్లాదేశ్ అని, దీని వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉండే అవకాశం ఉన్నదని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు.
అలాంటి కుట్ర ఏమైనా ఉందో తెలుసుకునేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. నిందితుడిని ఐదు రోజుల పాటు ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
కాగా, విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని, సైఫ్‌పై తానే దాడి చేశానని ఒప్పుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.