సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు ఆదివారం (జనవరి 19) తెలిపారు. నిందితుడి వద్ద బంగ్లాదేశ్ జాతీయుడని సూచించే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దీక్షిత్ గెడం మీడియాకు వెల్లడించారు.  

నిందితుడి అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం అని వెల్లడించిన పోలీసులు.. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్‌(30)గా పేరు మార్చుకున్నట్లు తెలిపారు. అతని వద్ద భారతీయుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని అన్నారు. నిందితుడు 5.. 6 నెలల క్రితం ముంబైకి వచ్చినట్లు.. ముంబై, థానేలలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు మహ్మద్.. నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడినట్లు తెలిపారు. 

సైఫ్ అలీఖాన్‌పై దాడి అనంతరం నిందితుడు నిరంతరం న్యూస్ ఛానెళ్లను చూస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టుకు భయపడి ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు విజయ్ దాస్, బిజోయ్ దాస్, మహ్మద్ ఇలియాస్‌ వంటి పలు పేర్లతో తిరుగుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.